రైనా కుటుంబంలో అంత ఘోరం జరిగిందా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2020 3:34 AM GMTఅసలే చెన్నై సూపర్ కింగ్స్ టీంలోని ఇద్దరు ఆటగాళ్లతో పాటు మొత్తం ఆ జట్టు బృందంలోని 13 మందికి కరోనా సోకింది. ఇది చాలదన్నట్లు ఆ జట్టు కీలక ఆటగాడు సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి పయనం అయ్యాడు. అతను ఐపీఎల్ మొత్తానికి దూరమవుతున్నట్లు కూడా చెన్నై జట్టు ప్రకటించింది. దీంతో రైనాకు అంత పెద్ద సమస్య ఏమొచ్చిందనే సందేహం అందరినీ వేధిస్తోంది. దీనికి ఓ ప్రధాన పత్రిక సమాధానం చెప్పింది. రైనా కుటుంబంలో పది రోజుల కిందట జరిగిన ఘోర ఉదంతమే.. అతనిలా అర్ధంతరంగా స్వదేశానికి పయనం కావడానికి కారణమట.
రైనా మేనత్త అయిన ఆశాదేవి, ఆమె భర్త అశోక్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఈ నెల 19న తమ ఇంటి మేడ మీద నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దాటాక దోపిడీ కోసం వచ్చిన కొందరు దుండగులు వారిపై పాశవిక దాడి చేశారట. ఈ దాడిలో అశోక్ కుమార్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రైనా మేనత్తకు తీవ్ర గాయాలయ్యాయట. ఆమెను ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు తెలిసింది.
ఆమె పరిస్థితి విషమించడంతో రైనా స్వదేశానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది. ఆమె అంటే అతడికి చాలా ఇష్టమట. ఆ దాడిలో అశోక్ కుమార్ తల్లి, ఇంకో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయట. అందరూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతం రైనా కుటుంబంలో విషాదాన్ని నింపింది. దీంతో యూఏఈలో ఉండలేక, మేనత్తను చూసేందుకు రైనా స్వదేశానికి వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఐపీఎల్‌కు దూరం కావాలని అతను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.