వార ఫలములు : తే 29-11-2020 ఆదివారం నుండి 6-12-2020 శనివారం వరకు
Raasipalalu 29th Nov To 6th Dec. ఈ వారంలో 54% శుభ ఫలితాలు పొందే అత్యంత అదృష్ట రాశి *కన్యారాశి*. అత్యంత తక్కువ ఫలితాల
By Medi Samrat Published on 29 Nov 2020 3:39 PM ISTఈ వారం లో వచ్చే ప్రత్యేక పర్వదినములు.
తే.29-11-2020 ది. ఆదివారం *జ్వాలా తోరణం* రాత్రి పౌర్ణమి గల రోజు.
తే. 30-11-2020 ది. సోమవారం *కార్తీక పౌర్ణమి నోములు*.
*కార్తీక మాసం 3వ సోమవారం.*
తే. 3-12-2020 ది. గురువారం *సంకటహర చతుర్థి.*
ఈ వారంలో 54% శుభ ఫలితాలు పొందే అత్యంత అదృష్ట రాశి *కన్యారాశి*. అత్యంత తక్కువ ఫలితాలు అనగా 18% మాత్రమే శుభ ఫలితాలు పొందే రాశి *మేష రాశి.*. ఫలితాలు సక్రమంగా లేవని బాధ పడేకంటే దైవారాధన తో వాటి యొక్క తీవ్రతను, ప్రతికూలతను తగ్గించుకోవచ్చు. మానవ ప్రయత్నము దైవానుగ్రహము రెండూ కలిస్తే శుభఫలితాలను ఎక్కువగా పొందగలుగుతామ్. ఇది మన *భారతీయ సంస్కృతిలో* అందులోనూ *వేద శాస్త్ర పురాణాలలో* ఉండే గొప్పతనము.
మేషరాశి :- ఈ రాశి వారికి ధన లాభం కోరిన కోరికలు నెరవేరడంతో ఈవారం కొంచెం ఆనందదాయకంగా గడిచిపోతుంది. ఈ రాశి వారికి ఆరు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా గురుడు శ్రమని తెలియజేస్తున్నాడు. శుక్రుడు కుటుంబాన్ని దాని అభివృద్ధిని తెలియ చేస్తున్నాడు. ప్రధానమైన అంశాలు ఈ ఇద్దరి చేతిలో ఉంటాయి. వాళ్ళిద్దరూ బాగోలేనప్పుడు మనము స్వతంత్రించి ఏ పని చేయకుండా భగవంతుని మీద భారం వేసి పని చేయడమే కర్తవ్యమౌతుంది. గ్రహ అనుకూలత లేదని నిరంతరం బాధపడే కంటే అనుకూలత కోసం వాటి కంటే అతీతమైన భగవంతుని ప్రార్థించడం వల్ల ఫలితాలు సుగమమవుతాయి. రవి వృశ్చికంలో ఉన్నాడు గనుక సుమారుగా అన్ని రాశులకు కూడా ప్రతికూలంగానే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సూర్యారాధన చేయండి యోగా చేయండి. వృద్ధి క్షయములు అనేవి చంద్రుని బట్టి ఉంటాయి కాబట్టి చంద్రుని స్థితిని బట్టే వార ఫలితాలు కూడా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అట్లాంటి చంద్రుడు 12 రాశులలో ఈ వారంలో సుమారుగా ప్రతికూలతతో ఉన్నాడు కాబట్టి మనసు కారకుడైన చంద్రుడు కూడా సహకరించేది తక్కువ అయింది. కాబట్టి మనం దైవం మీద మీద ఆధారపడాలి. ఈ రాశివారికి ఈ వారంలో 18 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతి కూలతలు ఎక్కువగా ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది కాబట్టి ఆర్థికపరంగా బాగుంటుంది. కృత్తికా నక్షత్రంఒకటో పాదం వారికి జన్మతార అయింది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
పరిహారము :- నవగ్రహ ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. యోగ సాధన చాలా అవసరము. ప్రతిరోజు రుద్రాభిషేకం చేయండి, శివ స్తోత్రాలు పారాయణ చేసినా మంచిదే.
వృషభ రాశి :- ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక లాభాలు ఆనందదాయకమైన జీవితం వైపు తీసుకుపోతాయి. ఇంతకుముందు మీదట వీరికి ఫలితాలు మెరుగు పడనున్నాయి. అయితే మీ మీద ద్వేషం పెంచుకున్న వారు పెరిగారు కాబట్టి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేసినట్లు అయితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మంచి కార్యక్రమానికి గాను మీ ధనము వినియోగమవుతుంది. అష్టమం లో రవి ప్రభావము మీకు విచారాన్ని కలుగజేస్తుంది. శుక్రుడు శని కూడా మీకు అపకీర్తిని రోగాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు. రాహు కేతువులు కూడా మీకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. అయినా సరే మీకు ఈ వారంలో 45శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది ఆర్థిక లాభాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు జన్మ తార కాబట్టి ఆరోగ్యం విషయంలో దృష్టి పెట్టాలి.. మృగశిర 1 2 పాదాలు వారికి మాత్రం పరమమిత్ర తార అయింది కాబట్టి అన్ని రకాలుగానూ బాగుంటుంది.
పరిహారం :- సూర్యనమస్కారాలు, సూర్యోదయ సమయానికి సూర్య దర్శనం చేయండి. కార్తీక మాసం కాబట్టి శివారాధన మీకు మంచి ఫలితాన్నిస్తుంది.
మిధున రాశి: ఈ రాశి వారికి కాస్త అనుకూల తక్కువ గా చెప్పొచ్చు. శత్రు నాశనం అలంకార ప్రాప్తి మీకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ ధనానికి ఇబ్బంది పడిపోతారు. అయితే శుక్ర గ్రహము ప్రభావము, కేతువు యొక్క ప్రభావము మిమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మీ జీవితాన్ని మీరే సరిచేశుకుంటూ మీరు సంతోషాన్ని పొందగలుగుతారు. మీ మంచిని కోరే బంధువులతో సమయాన్ని గడిపినట్లు అయితే జీవితం సుఖవంతంగా ముందుకు పోవడానికి చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. ఎన్నాళ్ళో పరిష్కారం కాని చాలా పనులు ఈ వారంలో నెరవేరే అవకాశం కూడా ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అలా అని మీకు ఉన్న సమస్యలు, అనారోగ్యము పూర్తిగా తొలగిపోతాయి అని కాదు. సజ్జన సాంగత్యం తో మీరు మీ జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. అందుకు కచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వారం మీకు 36 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార కాబట్టి అన్నీ సానుకూలంగా జరిగిపోతాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తార కాబట్టి బాగుంటుంది పునర్వసు 1 2 3 పాదాలు వారికి మాత్రం నైధన తార కాబటీ చేసే ప్రతి పనిని ఆచితూచి ఆలోచించి చేయడం మంచిది.
పరిహారం :- శనికి జపము, హోమము నల్ల నువ్వుల దానం చేస్తే మంచిది.గురువార నియమాలు పాటించండి. గురు చరిత్ర చదవండి మేధా దక్షిణామూర్తి స్తోత్రం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి :- ఈ రాశి వారికి శుభ పరిణామాలు కొనసాగుతున్నాయి. అయితే ఏ పని చేసినా మీరు భయం భయం గానే ముందుకు వెళతారు. నిజానికి మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకు వెళతాడు అని నమ్మండి. ఈవారం మీకు విశేష ధన లాభం ఉంది అయితే ఎంత సంపాదించారో అంత ఖర్చు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సప్తమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పెరుగుతుంది కానీ మీ శక్తికి తగిన ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి. విందు వినోదాలకు హాజరవుతారు. శుభకార్యాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈవారం మీరు ఏదో ఒక లాభాన్ని స్త్రీల ద్వారా పొందుతారు. మీ చుట్టూ ఎంత మంది ఉన్నా మీరు మానసికంగా దుర్బలులు అయిపోతారు అటువంటి స్థితి నుంచి మీకు మీరుగా బయట పడవలసి ఉంటుంది. ఇందుకోసం మీరు భగవంతుని ప్రార్థించడం మంచిది. ఏది ఏమైనప్పటికీ మీకు ఈ వారంలో 45శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి నైధన తార అయింది చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చూసుకోండి. పుష్యమి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
పరిహారం :- కార్తీక మాసం ప్రతిరోజూ శివునికి అభిషేకం చేయండి. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయము పారాయణ మీ మనోబలాన్ని పెంచుతాయి.
సింహరాశి :- ఈ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. చతుర్దంలో ఉన్న రవి అగౌరవాన్ని కలిగిస్తాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి పనిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. అనవసరమైన పనులలో జోక్యం చేసుకోకండి. కుజుడు మీ శరీరానికి కాస్త అనారోగ్యాన్ని కలిగించే సూచనలు ఉన్నాయి కాబట్టీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గత కొంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. అంతేకాదు మీరు ఈ వారంలో ఆర్థిక పురోగతిని కూడా పొందుతారు. రవి కేతువులు ఇద్దరు మీ గౌరవాన్ని భంగం కలిగించే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మీరు మానసికంగా మరింత సన్నద్ధులు కావాలి. ఇందుకు మీరు భగవంతుని సహాయము తీసుకోవాల్సిందే. ఈ వారంలో 45 శాతం శుభఫలితాలు ఉన్నాయి.మఖా నక్షత్ర జాతకులకు క్షేమతార అయింది అనుకూలతలు ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు విపత్ తార కాబట్టి అనుకూలతలు ఉండవు . ఉత్తర 1వ పాదం వారికి సంపత్ తార అయింది కాబట్టి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది.
పరిహారం :- సూర్యునకు, రాహు కేతువులకు పూజలు చేయించండి. సూర్య నమస్కారాలు చేయించండి. ఆరోగ్యం కోసం యోగ సాధన మంచిది.
కన్యారాశి :- ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. ఆర్థికంగా పురోగమిస్తున్నారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే శత్రువుల వల్ల కొంత మానసిక ప్రశాంతతను కోల్పోతారు. చేసే పనులలో విఘ్నాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనులలో మీ ప్రమేయం లేకుండా జరిగే చిన్న చిన్న అవకతవకలు మిమ్మల్ని ఎదుటివారు ఎత్తిచూపేలా చేస్తాయి. కాబట్టి మీరు ప్రతి పనిలో చాలా అప్రమత్తంగా ఉండటం మంచిది. అన్నిటినీ అధిగమించే శక్తి మీలో ఉంది అని నమ్మండి. ఇంట్లోని పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి. ఈ రాశివారికి ఈ వారంలో54 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం 2 3 4 పాదాలు వారికి సంపత్ తార కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. హస్త నక్షత్రం వారికి జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. చిత్త 1 2 పాదాల వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : బుధవారం నియమాలు పాటిస్తూ నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారంనాడు ఉదయమే ఆవుకు తినిపించండి.
తులా రాశి :- ఈ రాశి వారికి ఈవారం కాస్త ఇబ్బందులు కలుగజేసేది గా కనిపిస్తోంది. రవి, శని లతో పాటు రాహుకేతువులు కూడా మిమ్మల్ని శారీరకంగానూ మానసికంగానూ ఇబ్బందుల్లో పడేస్తున్నారు. చేసే పని మీద శ్రద్ధ పెట్టకపోతే ఉన్నతాధికారులతో మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈవారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆర్థికంగా ఈవారం మీకు చాలా బాగుంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. అయితే ఆ హడావిడిలో మీరు ఏదో ఒక వస్తువుని పోగొట్టుకుంటారు. కాబట్టీ కాస్త జాగరూకతతో వ్యవహరించండి. కుజుడు మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ శని శారీరక అనారోగ్యాన్ని కలిగిస్తాడు. దీనితో సంపాదించినదంతా ఆరోగ్యం విషయంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈవారం మీకు 36 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్తా 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కృషి చేస్తే చాలా ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంది. విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలు వారికి నైధనతార అవుతుంది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువ.
పరిహారం: శనికి జపము హోమము,నల్ల నువ్వులు దానం చేయండి తైల అభిషేకం చేయించండి. శని స్తోత్రం పఠించండి. రవికి సూర్య నమస్కారాలు విశేష ఫలితము.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ వారం ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయాలి. చేసే ఏ పనిలోనూ సంపూర్ణమైన ఫలితాన్ని పొందలేరు సరికదా అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. తద్వారా రాజదండన, స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. మీరు ఎప్పుడు దొరుకుతారా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బందులు కలుగ చేద్దామా అనే స్థితిలో శత్రువులు మీ చుట్టూ పొంచి ఉన్నారు. అంతేకాదు మీరు ఎవరికన్నా మంచి చేద్దామని ప్రయత్నించినప్పటికీ అది మీకు ఏ రకమైన లాభాన్ని ఇవ్వదు. అంతే కాదు మిమ్మల్ని ఎదుటివారి దృష్టిలో ఒక మెట్టు కిందకి దిగజార్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలో సైతం మీ కుటుంబ సభ్యులు అందులోని ముఖ్యంగా స్త్రీల వల్ల మాత్రమే ఆనందాన్ని పొందుతారు అది మీ తల్లి కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు భార్య కావచ్చు లేదా కుమార్తె కావచ్చు. వీరు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అయితే మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికంగా మీకు మంచి స్థితి ఉండటం మిమ్మల్ని కాస్త తృప్తి పరుస్తుంది. ఈవారం మీకు 27 శాతం మాత్రమే శుభ ఫలితాలున్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి నైధన తార అయింది తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ట నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కృషి చేస్తే మంచి స్థితికి వెళ్లే అవకాశం ఉంది.
పరిహారం :- ఏకాగ్రత కోసం ప్రయత్నించండి. ధ్యాన స్థితి మీకు ఉపకరిస్తుంది. ముందు రోజు నాన వేసిన పెసలు బుధవారం నాడు ఉదయం బెల్లం వేసి ఆవుకు తినిపించండి. గురుకృప కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ధన లాభం ఆనందము, సుఖజీవితం ఇచ్చి మంచి మార్గంలో వీరిని నడిపిస్తుంది. శత్రువుల బాధ మాత్రం వీరికి తప్పదు. అలాగే మృత్యు భయం కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. శని ప్రభావం చేత మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ మీకు శుక్రుడు ప్రభావము అది ఒక మంచికే మార్చేస్తుంది. ఎవరికీ లేని అనుకూలత రాహు మీకు సుఖ జీవితాన్ని పంచు తున్నాడు. అటువంటి అవకాశం మీకు వస్తుంది కనుక అది వినియోగించుకున్నట్లు అయితే మీరు చాలా విషయాల్లో ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడమే కాక ఇతరులను కూడా మాటల ద్వారా చేతల ద్వారా మెప్పించగలరు. ఏది ఏమైనప్పటికీ మీకు ఈ వారం ధన సంపాదనకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో ఎక్కువ హాయిని ఆనందాన్ని పొందగలుగుతారు. నూతన వ్యాపారాదులు కి పెద్ద అనుకూలంగా లేదు గాని పాత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. మూల నక్షత్రం వారికి క్షేమ తార అయింది మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సంపత్తార తో వారం ప్రారంభం శుభఫలితాలు ఉన్నాయి.
పరిహారం :- బుధవార నియమం పాటించండి, విష్ణు సహస్రనామ పారాయణ, అమ్మవారి స్తోత్రాలు పారాయణ విశేష లాభాన్ని కలిగిస్తాయి.
మకర రాశి :- ఈ రాశి వారికి సకల భోగాలు అమరుతాయి. సంతోషము ఉంటుంది ఈ వారంలో వీరు పాత బాకీలు వసూలు చేసుకోవడం ద్వారా ధనలాభం కలుగుతుంది . కుజ బుధ, గురు శుక్రులు మంచి అనుకూలంగా ఉన్నారు కనుక మీరు ఈ సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటే ఇంకా బాగుంటుంది. కేతువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు గనుక దైవ పరంగా ఉండే లాభాలు చేకూరుతాయి. అంటే ఏ పని చేసిన దైవాన్ని సంకల్పించి చేస్తే మంచి జరుగుతుంది. . జన్మశని ప్రభావం కూడా మీ పైన ఎక్కువగానే ఉంది. యోగ సాధన మెడిటేషన్ ఏకాగ్రత మీకు చాలా అవసరము. విపత్తులను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కుజుడు మీకు సర్వరోగాలను కలుగజేస్తాడు. ఈ వారంలో మీకు 45 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి సంపత్ తార అయింది. ఆర్థికంగా చాలా మేలుజరుగుతుంది. శ్రవణా నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది కాబట్టి ఆరోగ్యపరంగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.
పరిహారం :- శని జపం చేయించండి. హోమము,నల్ల నువ్వులు దానంకూడా చేయవచ్చు. తైల అభిషేకం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
కుంభ రాశి: ఈ రాశివారికి ఈ వారం కార్యజయం ఒక్కటే కాస్తంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అది కచ్చితంగా సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కించిత్తు ధన లాభం కూడా ఉంది. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పనిలోనూ ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా మీకంటే ముందే మీ వ్యతిరేక భావాలు మీ వ్యతిరేక వర్గం అక్కడికి చేరి ప్రతి పని ఆటంక పరుస్తూ అయి ప్రతి దాంట్లో మీకు అనుమానం ఎక్కువ గా మరియు శ్రమ మిగులుతుంది ఎంత కష్టపడినా ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఎంతో కొంత ఫలితాన్ని అందుకోవడం ద్వారా మీరు సంతోషాన్ని పొందుతారు. అయితే గౌరవానికి కూడా భంగం వాటిల్లుతోంది. అంతేకాదు మీ శ్రమను గుర్తించేవారు కూడా తక్కువగా ఉంటారు. ఆర్థికంగా కూడా మీరు కాస్త నష్టపోతారు. ప్రదేశం మార్పు మీకు చికాకు ని అనారోగ్యాన్ని కూడా కలిగిస్తుంది అతి కష్టం మీద మీరు ఈ వారాన్ని దాటాల్సి ఉంటుంది. మీకు ఈ వారంలో 36శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. శతభిషం నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది. కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందుతారు. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి నైధనతార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం :- అమ్మవారిని నమ్ముకోండి సప్తశతి పారాయణ ఖడ్గమాల పారాయణ లలితా సహస్రనామ పారాయణ దీనిని విడిచిపెట్టకండి. వీలైతే గురువారం నియమం పాటించండి.
మీన రాశి :- ఈ రాశి వారికి మనసులో అనుకున్న కోరికలు నెరవేర తాయి. భూ సంపద ఆనందాన్ని కలిగిస్తాయి. రవి ప్రభావం వీరి మీద ఉండటం చేత కష్టాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఏవైనా విలువైన వస్తువులను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రభావం చేత ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా చుట్టుముట్టే స్థాయి. గురు శుక్రులుమీకు లాభాన్ని భూ సంపదను కలిగించనున్నారు. అలాగే మీకు శని పూర్తి అనుకూలంగా ఉండి విశేష ధనాన్ని ఇస్తాడు. దానికి తోడు రాహువు సంపదలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఈ రెండిటి అనుకూలతలు మీకు వినియోగించుకుంటే కచ్చితమైన లాభాల్ని పొందగలుగుతారు. ధన ఆదాయం బాగుంది అన్నప్పుడు దాన్ని దగ్గర ఉంచుకోకుండా స్థిరంగా నికర ఆదాయం గా మార్చి పెట్టండి. చర ఆదాయంగా ఉంచుతున్నట్లు ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీకు ఈ వారంలో 45 శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. పూర్వాభాద్ర 4వ పాదం వారికి నైధన తార అయింది కాబట్టీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సాధన తార అయింది అన్ని పనులు నెరవేరుతాయి. రేవతీ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం :- కుజునికి జపం చేయించండి. సూర్య నమస్కారాలు, యోగసాధన మీకు లాభిస్తాయి.