బ్యాట్స్‌మెన్‌కు ఫ్రీ హిట్.. బౌలర్‌కు ఫ్రీ బాల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2020 11:08 AM IST
బ్యాట్స్‌మెన్‌కు ఫ్రీ హిట్.. బౌలర్‌కు ఫ్రీ బాల్

ఐపీఎల్ మొదలుకాక ముందే మన్కడింగ్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. భారత జట్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ కొత్త ఐడియాతో ముందుకు వచ్చాడు. బ్యాట్స్మెన్ లకు 'ఫ్రీ హిట్' ను ఎలాగైతే ఇస్తారో బౌలర్లకు కూడా ఫ్రీ బాల్ అన్నది ఉండాలని అశ్విన్ చెప్పుకొచ్చాడు. బౌలర్ నో బాల్ వేసినప్పుడు.. ఆ తర్వాతి బంతికి ఫ్రీ హిట్ గా చెబుతూ ఉంటారు.. బ్యాట్స్మెన్ ఆ బంతిని ఎలాగైనా బాదొచ్చు.. ఆ బంతికి కేవలం రనౌట్ మాత్రమే ఉంటుంది.

అచ్చం అలాగే బౌలర్లకు కూడా ఫ్రీబాల్ అన్నది ఇస్తే బాగుంటుందని చెబుతున్నాడు అశ్విన్. బౌలింగ్ వేస్తున్న సమయంలో నాన్-స్ట్రైకర్ క్రీజు దాటితే ఆ తర్వాతి బంతిని 'ఫ్రీ బాల్' గా ప్రకటించాలని.. ఆ బంతికి బ్యాట్స్మెన్ అవుట్ అయితే జట్టు స్కోర్ నుండి 5 పరుగులు తగ్గిస్తే బాగుంటుందని అంటున్నాడు అశ్విన్. ఫ్రీ హిట్ నిబంధనతో బ్యాట్స్‌మెన్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని.. బౌలర్లకు అలాంటి ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదని అశ్విన్ అడిగాడు. బౌలర్‌కు ఫ్రీ బాల్‌ ఇవ్వండి. బంతి వేసేముందే బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటితే బ్యాటింగ్‌ జట్టు నుంచి 5 పరుగులు తగ్గించాలి. ఫ్రీహిట్‌తో లాభమంతా బ్యాట్స్‌మన్‌కే కదా. అలాగే బౌలర్లకూ అవకాశం ఇవ్వండని అశ్విన్ ట్వీట్ చేశాడు. ఇప్పుడంతా బౌలింగ్‌ను ఎలా చితకబాదుతారో అన్న ఆసక్తితోనే క్రికెట్‌ చూస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు అశ్విన్.

గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ అయిన అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా ఔట్ చేయడం రచ్చ రచ్చయింది. కొందరు అశ్విన్ ను తప్పుబడితే.. మరికొందరు సమర్థించారు. ఈ ఏడాది అశ్విన్ పంజాబ్ జట్టు నుండి ఢిల్లీ జట్టుకు వచ్చాడు. మన్కడింగ్‌ చేసేందుకు అంగీకరించనని ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌ ఇటీవలే అనడంతో బాగా చర్చకు దారితీసింది. తాను రికీ పాంటింగ్‌తో ఈ విషయంపై చర్చించానని రవిచంద్రన్ అశ్విన్‌ తెలిపాడు. పాంటింగ్ దుబాయ్‌ చేరుకోగానే అతనితో ముఖాముఖి చర్చిస్తానని పేర్కొన్నాడు. టెలిఫోన్‌ సంభాషణలో ఏమేం మాట్లాడుకున్నారో మరో వారం రోజుల్లో చెబుతానని అన్నాడు. ఇంకా సీజన్‌ ఆరంభం కాకముందే మన్కడింగ్‌పై చర్చ జరుగుతోంది.

Next Story