నేటి నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Nov 2019 3:52 PM ISTఅమరావతి : ఈ రోజు నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ని ఏపీ ప్రభుత్వం విస్తరింపజేసింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్ ఆసుపత్రుల డాక్టర్లు, అక్కడి వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చికిత్సల విధానంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు.
సీఎం జగన్ ముందుగా హైదరాబాద్ మెడ్‌కవర్ ఆసుపత్రి వైద్యుడు కృష్ణప్రసాద్‌తో మాట్లాడారు. అనంతరం డాక్టర్ కృష్ణప్రసాద్ స్పందిస్తూ.. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చిన కార్యక్రమమని కొనియాడారు. ఇతర రాష్ట్రాల్లోవైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపుతో రాష్ట్రానికి చెందిన పేదలు ఈ రోజు నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో సెలక్ట్ చేసిన ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చు. 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ మూడు నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి నేటి నుంచి రానున్నాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.