దేశ రాజకీయాల్లో మారుమ్రోగిపోతున్న అర్నాబ్ పేరు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2020 10:21 AM GMT
దేశ రాజకీయాల్లో మారుమ్రోగిపోతున్న అర్నాబ్ పేరు

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అర్నాబ్ గోస్వామి పేరు మారుమ్రోగి పోతోంది. కొందరు నాయకులు శివసేన ప్రభుత్వం కక్ష పెట్టుకుని మరీ ఈ పని చేస్తోందని చెబుతూ ఉన్నారు. మరో వైపు అర్నాబ్ చేసిన పాపాలు పండాయని అంటూ ఉన్నారు. ఎటువంటి కక్ష సాధింపు అర్నాబ్ విషయంలో లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతోందని శివసేన చెబుతోంది.

అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి మొదటిరోజు అలీభాగ్‌లోని ఓ పాఠశాలలో గడిపారు. ప్రస్తుతం దీన్ని తాత్కాలిక జైలుగా ఉపయోగిస్తున్నారు. ప్రధాన జైలుకు పంపేముందు మందు జాగ్రత్త చర్యగా 14 రోజుల పాటు నిందితులను జైలు అధికారులు క్వారంటైన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అర్నాబ్‌ను తాత్కాలిక జైళ్లో ఉంచారు.

అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో తమతో సహకరించాల్సిందిగా పోలీసులు పలుమార్లు అర్నాబ్‌ను కోరడం అందులో కనిపించింది. అర్నాబ్ మాత్రం పోలీసులు తనపై దాడిచేసినట్టు ఆరోపిస్తున్నారు. కాగా, తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా అర్నాబ్ పెట్టుకున్న పిటిషన్‌ను నేడు బాంబే హైకోర్టు విచారించనుంది. బెయిలు కోసం కూడా ఆయన దరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం.

2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆర్కిటెక్చర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ ప్రమోటర్ అర్నాబ్ గోస్వామికి కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. అర్నాబ్‌ను రెండు వారాలపాటు కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను తిరస్కరించిన అలీబాగ్ కోర్టు.. అరెస్ట్ సమయంలో తనపై పోలీసులు భౌతికదాడికి దిగారన్న అర్నాబ్ ఆరోపణలను కూడా తోసిపుచ్చింది.

అర్నాబ్‌ గోస్వామి అప్పడే బకాయిలు చెల్లిస్తే ఈ రోజు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్‌ నాయిక్‌ (53) భార్య అక్షత వ్యాఖ్యానించారు. అర్నాబ్‌ గోస్వామిని అలీబాగ్‌ పోలీసులు అరెస్టు చేయడంతో తన భర్త, అత్తకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడ్డాయన్నారు. బుధవారం అర్నాబ్ అరెస్టు అనంతరం ఆమెతోపాటు ఆమె కూతురు ఆద్న్యా నాయిక్‌ సైతం విలేకరులతో మాట్లాడారు.

టీవీ స్టూడియో పనులు చేయించుకున్న అర్నాబ్‌ పూర్తి డబ్బులు చెల్లించలేదని అక్షత ఆరోపించారు. దీంతోనే అప్పుల్లో కూరుకుపోయిన ఆయన కొత్త పనులు చేయలేకపోయారని తెలిపారు. తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త అన్వయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీంతో ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని ఆమె చెప్పారు.

Next Story