రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి అరెస్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2020 5:45 AM GMT
రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి అరెస్టు

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో డిజైనర్‌ ఆత్మహత్యకు కార‌ణ‌మ‌య్యార‌నే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారని తెలిపింది.

ఇదిలావుంటే.. ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి 2018 మేలో అలీబాగ్‌లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు.. బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు అర్నాబ్ తో సహా సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే.. ఈ ఏడాది మేలో అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించారు. ఈ నేఫ‌థ్యంలోనే ప్ర‌స్తుత ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.ఇదిలావుంటే.. అర్నాబ్ ను అరెస్టు చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ స్పందించారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Next Story
Share it