బస్సును హైజాక్‌ చేసిన దుండగుడు.. బందీలుగా 20మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2020 12:41 PM GMT
బస్సును హైజాక్‌ చేసిన దుండగుడు.. బందీలుగా 20మంది

20 మంది ప్రయాణికులతో వెలుతున్న బస్సును ఓ దుండగుడు హైజాక్‌ చేశాడు. ఈ ఘటన ఉక్రెయిన్‌లో జరిగింది. ఉక్రెయిన్‌లోని లస్క్‌నగర్‌లో దుండగుడు బస్సును హైజాక్‌ చేసి ఓ థియేటర్‌ సమీపంలో పార్క్ చేశాడు. బస్సులోని 20మందిని బందీలుగా చేసుకున్నాడు. దుండగుడు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మారణాయుధాలు తీసుకొని బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సు కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆ బస్సులోని ప్రయాణికులకు ఆయుదాలు చూపి బెదిరించి బస్సును హైజాక్‌ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైజాక్‌ అయిన బస్సును గుర్తించారు. దుండగుడి చెర నుంచి బందీలుగా ఉన్న ప్రయాణీకులను రక్షించేందుకు స్పెషల్ ఆపరేషన్‌ చేపడుతున్నారు. బస్సు సమీపంలోని చుట్టు పక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. బస్సును పోలీసులు చుట్టుముట్టారు. దుండగుడి డిమాండ్స్‌ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి డిమాండ్లు ఏమిటో స్పష్టంగా తెలియడం లేదని.. వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడన్న సంగతి తెలిసిందని.. అది కూడా దుండుగుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడన్నారు. సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు పెట్టడంతో.. చర్చలు ముందుకు సాగడం లేదని.. అయితే ఫోన్‌ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సును హైజాక్‌ చేసిన వ్యక్తిని సజీవంగా పట్టుకుని విచారించాలని అనుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Next Story