అర్జున్ టెండూల్కర్ ను అలా వాడుకుంటున్న ముంబై ఇండియన్స్
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2020 6:12 PM ISTఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19న ఐపీఎల్ మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు ఐకాన్ అయిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు రాహుల్ చాహర్ పోస్టు చేసిన ఫోటోలో అర్జున్ టెండూల్కర్ కనిపించాడు. ఎంఐ ఆటగాళ్లతో పాటూ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ కూడా ఆ ఫోటోలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్ ఏమి చేస్తున్నాడా..? అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఒక నెట్ బౌలర్ గా సేవలు అందిస్తూ ఉన్నాడట. ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్లలో ఒకడిగా భారత క్రికెట్ అర్జున్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. నెట్ బౌలర్లను సెలెక్ట్ చేసుకోవడం అన్నది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం చేతిలో ఉంటుందని బీసీసీఐ అధికారి తెలిపాడు.
గతంలో కూడా పలుమార్లు అర్జున్ టెండూల్కర్ నెట్ బౌలర్ అవతారం ఎత్తాడు. టీమిండియా జట్టుకు, ఇంగ్లాండ్ జట్టుకు కూడా నెట్స్ లో బౌలింగ్ వేసేవాడు. భారత మహిళల జట్టుకు కూడా అర్జున్ టెండూల్కర్ వరల్డ్ కప్ సమయంలో నెట్స్ లో బౌలింగ్ చేశాడు అర్జున్.