అర్జున్‌ కపూర్‌కి కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 11:08 AM GMT
అర్జున్‌ కపూర్‌కి కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. చిన్నా-పెద్దా, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక బాలీవుడ్‌లో ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీతో పలువురు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.

‘ మీ అందరికి తెలియజేయడం నా కర్తవ్యం . నాకు కరోనా వైరస్‌ సోకింది. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. లక్షణాలేవీ కనిపించడం లేదు. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ముందుగానే ధన్యవాదాలు తెలుపుతున్నాను . నా ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్‌ మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాను. ఈ క్లిష్ట సమయాల్లో.. మానవత్వమే వైరస్‌పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను." అని అర్జున్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

కాగా ఇటీవలే ఆయన సెట్స్ మీదకు వెళ్లగా.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మలైకా అరోరా పరిస్థితి ఏంటి, ఆమెకు కూడా కరోనా వచ్చిందేమోనని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో అపార్ట్‌మెంట్‌లో వీరు కలిసి ఉన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

Next Story