ఓటీటీలో ‘బాంబు’ పేలేది ఆ రోజే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 7:30 AM GMT
ఓటీటీలో ‘బాంబు’ పేలేది ఆ రోజే..

సౌత్‌లో నేరుగా ఓటీటీల్లో రిలీజైన పెద్ద సినిమాలు చాలా తక్కువ. దక్షిణాదిన అన్ని భాషల్లో కలిపితే థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజైన అతి పెద్ద సినిమా అంటే.. ‘వి’నే. ఈ చిత్రం శుక్రవారం రాత్రి అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన సంగతి తెలిసిందే. ఐతే హిందీలో మాత్రం ఇప్పటికే పేరున్న సినిమాలు చాలానే ఇలా విడుదలయ్యాయి. అమితాబ్ బచ్చన్-ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’తో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’, విద్యాబాలన్ మూవీ ‘శకుంతలా దేవి’, ఆలియాభట్-సంజయ్ దత్-ఆదిత్య రాయ్ కపూర్‌ల ‘సడక్-2’.. ఇలా పెద్ద బడ్జెట్ సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే డైెరెక్ట్ ఓటీటీ రిలీజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఐతే వీటిలో కొన్ని మంచి స్పందన రాబట్టుకోగా.. కొన్ని నిరాశకు గురి చేశాయి.

ఐతే ఓటీటీల్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాల వరుస చూస్తే అవి చాలా వరకు క్లాస్ టచ్ ఉన్నవే. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌నే ఎక్కువగా ఆకర్షించాయి. ఓటీటీల్లో ఇప్పటిదాకా పూర్తి స్థాయి మాస్ మసాలా సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ఆ లోటును తీర్చే చిత్రం అవుతుందని ‘లక్ష్మీ బాంబ్’ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇది దక్షిణాదిన భారీ విజయం సాధించిన ‘కాంఛన’ చిత్రానికి రీమేక్. మాతృక దర్శకుడు లారెన్స్.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. లాక్ డౌన్ లేకుంటే వేసవిలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. ఆ మధ్య హాట్ స్టార్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం ఒప్పందం చేసుకున్న అరడజను పెద్ద సినిమాల్లో ‘లక్ష్మీబాంబ్’ కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై ఊరిస్తూ వచ్చిన హాట్ స్టార్.. దీపావళి కానుకగా దీన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. నవంబరు 13న ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తారట. ఈ సినిమాకు సంబంధించి కొంత టాకీ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలుండగా.. త్వరలోనే వాటిని పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చేయబోతున్నారట.

Next Story