టాక్ ఆఫ్ ద టౌన్.. దిల్ రాజు గ్రేట్ ఎస్కేప్

By సుభాష్  Published on  6 Sep 2020 7:15 AM GMT
టాక్ ఆఫ్ ద టౌన్.. దిల్ రాజు గ్రేట్ ఎస్కేప్

తెలుగులో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజైన వాటిలో అతి పెద్ద సినిమా అంటే ‘వి’నే. ఎంతో సస్పెన్స్ తర్వాత ఈ మధ్యే ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వాళ్లకు అమ్మేశాడు నిర్మాత దిల్ రాజు. ఈ డీల్ పూర్తవ్వగానే కొన్ని రోజులకే ఈ చిత్రాన్ని విడుదల చేసింది అమేజాన్ ప్రైమ్. కానీ ఈ సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకం ఏమాత్రం నిలబడలేదు. నాని-ఇంధ్రగంటి మోహనకృష్ణ-దిల్ రాజు.. ఇలాంటి కాంబినేషన్ చూసి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశించిన వాళ్లకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇదొక సగటు రివెంజ్ డ్రామా. అంతకుమించి ఏ ప్రత్యేకతా లేదు. శుక్రవారం రాత్రి ‘వి’ ఫస్ట్ షోస్ పూర్తి కావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో దిల్ రాజు పేరు మార్మోగిపోయింది. ఆయన మీద ప్రశంసలు.. కౌంటర్లు.. జోకులు.. ఇంకా మీమ్స్ కూడా.

‘హ్యాపీ’ సినిమాలో అల్లు అర్జున్.. మనోజ్ బాజ్‌పేయి దగ్గరికెళ్లి తన ప్రేమ గురించి ఒక డ్రామా ప్లే చేసి ఏడుస్తూ బయటికి వస్తాడు. బయట అడుగు పెట్టేసరికి ఏడుపంతా పోయి ఎక్కడలేని హుషారు కనిపిస్తుంది. సంబంధిత వీడియో క్లిప్‌లో బన్నీ పాత్రలో దిల్ రాజును పెట్టి ఒక మీమ్ తయారు చేశారిప్పుడు. తన సినిమాను థియేటర్లలో కాకుండా అమేజాన్‌లో రిలీజ్ చేస్తున్నందుకు దిల్ రాజు తెగ బాధపడిపోతున్నట్లు ముందు ఫీలింగ్ ఇచ్చి.. ఆ తర్వాత ఈ సినిమాను ఇలా వదిలించేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నట్లు ఈ మీమ్‌ను తీర్చిదిద్దారు. ఇలాంటి జోకులు, మీమ్స్ మరెన్నో కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ‘వి’ మీద నమ్మకం లేకే.. ఆయన ఇంకెంతో కాలం ఎదురు చూడటం వృథా అనుకుని ప్రైమ్ వాళ్లకు అంటగట్టేశాడని అంటున్నారు. ఈ సినిమా కనుక థియేటర్లలో రిలీజై ఉంటే రూ.20 కోట్ల షేర్ కూడా వచ్చేది కాదని.. అలాంటిది రూ.32 కోట్లకు ప్రైమ్ వాళ్లకు సినిమాను అమ్మేశాడంటే దిల్ రాజుది గ్రేట్ ఎస్కేపే అని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనే కాక ఇండస్ట్రీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయినట్లు తెలుస్తోంది.

Next Story