అరకు అందాలను రెట్టింపుచేస్తున్న వలిసపూల సొగసు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 11:31 AM IST
అరకు అందాలను రెట్టింపుచేస్తున్న వలిసపూల సొగసు

విశాఖపట్నం: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విశాఖజిల్లాలోని అరకులోయ మళ్లీ అందాలను ఆరబోసింది. విరగబూసిన బంగారు రంగు వలిసపూల సొగసులతో అరకు మిలమిలా మెరిసిపోతోంది. మిసమిసమిసలాడే అరకు పడుచు అందాలను చూసేందుకు, ఆనందంగా గుండెనిండా నింపుకునేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

చుట్టు పక్కల ఎటుచూసినా పది పరగణాల దూరం వరకూ పచ్చగా కనిపించే ఈ వలిసపూల వనాల సొగసును కళ్లారా చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఇక్కడి గిరిజనులు ప్రధానంగా ఈ పంటను పండిస్తారు. కానీ రెండేళ్లక్రితం ఈ నూనె గింజల పంటకు వేరుపురుగు పట్టి మొత్తం పంటంతా నష్టమైపోయింది. దీంతో గిరిజనులు పూర్తిగా ఆ పంటను పక్కనపెట్టి ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకున్నారు. దానివల్ల అసలు అరకు అందాలకే సిసలు చిరునామాయైన వలిసపూలు రెండేళ్లుగా పూర్తిగా కనుమరుగైపోయాయి.

Tourism 2

హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈసారి అరకు గిరిజన రైతులకు భరోసా ఇచ్చారు. శాస్త్రీయ పద్ధతుల్లో పంటకు ఎలాంటి నష్టం కలగని విధంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, భయపడాల్సిన పనిలేదని నచ్చజెప్పారు. వాళ్ల మాటల్ని విన్న అరకు గిరిజన రైతులు మళ్లీ ఈ ఏడాది ఈ నూనె గింజల పంటను వేయడానికి సాహసించారు. ఇంకేముంది.. మొత్తంగా అరకు లోయలోయంతా పసుపుపచ్చటి, బంగారు రంగు అందాలు పరుచుకున్నాయి. కేవలం ఈ అందాలను చూసేందుకే అరకు లోయకు వచ్చే యాత్రికులుకూడా ఉన్నారంటే అందులో అణుమాత్రమైనా అతిశయోక్తి లేదు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సంస్థ రసాయన ప్రక్రియలద్వారా సంరక్షింపబడిన ఐదు వందల కిలోల విత్తనాలను అరకు గిరిజన రైతులకు అందించింది. వీటిద్వారా స్వయం సమృద్ధిసాధించిన రైతులు తమంతటతాముగా విస్తారంగా పంటను వేసేందుకు అవసరమైన విత్తనాలను తయారు చేసుకున్నారు. ఈ సంస్థ అందించిన నైతిక మద్దతుతో ఈ ఏడాది పంట విస్తీర్ణం కూడా ఈ ప్రాంతంలో బాగా పెరగడం విశేషం.

Tourism 4

నిగర్ అనే ఈ నూనె గింజల విత్తనంనుంచి తీసే తైలాన్ని సౌందర్యానికి సంబంధించి వాడే అనేక రకాలైన వస్తువులు, ఉత్పత్తుల తయారీలో బాగా విరివిగా వాడతారు. పెయింటింగ్స్ తయారీలోకూడా దీన్ని పెద్ద ఎత్తున వాడతారు. ఈ కారణంగా ఈ పంటకు విపరీతమైన డిమాండ్ ఉంది దేశంలో.

అరకు, పాడేరు, విశాఖ ఏజెన్సీలోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ పంటను విస్తృతంగా పండిస్తారు. ఈ బంగారు రంగు పూల అందాలను చూసేందుకు ఒడిషా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుంచి యాత్రికులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తారు.

Next Story