'ఐ ఫోన్‌' వాడుతున్నారా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త..!

By సుభాష్  Published on  13 Dec 2019 8:27 AM GMT
ఐ ఫోన్‌ వాడుతున్నారా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త..!

ముఖ్యాంశాలు

  • ఐఫోన్లను టార్గెట్ చేస్తున్న అంతర్జాతీయ ముఠాలు
  • ఐఫోన్ పోగొట్టుకుంటున్నది ఎక్కువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే
  • ఏలాంటి ఫోన్ అయినా ఫోన్ అన్ లాక్ చేసేస్తున్న ముఠాలు
  • సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తుల నిజాలు బట్టబయలు

ఎంతో ఇష్టపడి కొనుక్కునే ఐఫోన్లు అంతర్జాతీయ ముఠాలకు టార్గెట్‌ అవుతున్నాయి. ఆ ఫోన్లను దొంగల ముఠాలు సునాయాసంగా తస్కరించి విదేశాలకు పంపిస్తున్నారు. తర్వాత సాంకేతికంగా ఫోన్‌ ఐడీ, పాస్‌ వర్డ్ లను బాధితుడి నుంచే తెలుసుకుని మరి ఫోన్‌లను అన్‌లాక్‌ చేసేస్తున్నారు. తర్వాత తిరిగి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ విషయాలన్ని బాధితులకు తెలియక లబోదిబోమంటున్నారు. ఇలాంటి ఓ అంతర్జాతీయ ముఠా వ్యవహారంపై సీటి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈ ముఠా దందాలకు చెక్‌ పెట్టే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లో ఏడుగురు సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఇలాంటి ముఠాలకు గురై పోలీసులను ఆశ్రయించారు. నిన్న పంజాగుట్టకు చెందిన ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజనీరు ఇలంటి ముఠాకు తాను కూడా మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, సెక్యూరిటీ పరంగా ఎంతో శక్తివంతమైనదిగా పేరొందిన ‘ఐఫోన్‌’హ్యాకింగ్‌ వెనుక అంతర్జాతీయంగా పెద్ద వ్యవహారమే జరుగుతోందని తెలుస్తోంది.

ఈ అంతర్జాతీయ ముఠాలు దళారుల ద్వారా స్థానికంగా ఉంటున్న దొంగలతోనే ఐఫోన్లు చోరీలు జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. పంజాగుట్టకు చెందిన ఓ సాఫ్ట్ వేర్‌ ఉద్యోగి డ్యూటీలో భాగంగా బెంగళూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, యాప్రాల్‌ లో ట్రావెల్‌ బస్సు దిగిన మళ్లీ సిటీ బస్సు ఎక్కాడు. బస్సులోటికెట్‌ తీసుకునే క్రమంలో ఓ వ్యక్తి అతడి జేబులో ఉన్న ఐఫోన్‌ -10ను కొట్టేసి బస్సు దిగి పరారయ్యాడు. దీంతోవెంటనే బాధితుడు ఫోన్‌ చోరీకి గురైనట్లు గుర్తించి కండక్టర్‌ మొబైల్‌ తీసుకుని ఆయన ఫోన్‌కు కాల్‌ చేయగా, అప్పటికే అది స్విచ్ఛాఫ్‌ అయినట్లు గుర్తించాడు. చోరీ చేసిన వెంటనే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడంటే ఆ చోరుడికి ఫోన్లపై ఎంత పట్టుందో తెలిసిపోతుందని పోలీసులు అంటున్నారు.

అందరు సిండికేట్‌గా ఏర్పడి..

ఇక చోరీకి గురైన ఫోన్లను కొనేందుకు సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారులు సిద్ధంగా ఉంటున్నారు. సిండికేట్‌గా ఏర్పడి ఫోన్లు తమ వద్ద కు చేరిన వెంటనే ఎక్స్‌ఫోర్ట్‌ పని మొదలు పెడుతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌ నగరానికి రష్యా, చైనాల నుంచి వివిధ వస్తువుల దిగుమతి జరుగుతూనే ఉంటుంది. ఇలా వచ్చిన వాటిలో కొన్నివివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి వ్యాపారులు ఒప్పందాలు కుదుర్చుకుని చోరీకి గురైన ఫోన్ల కొనుగోలుదారులు వాటితో కలిపి చోరీ సెల్‌ఫోన్లను ఆయా దేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్లకు చాలా సెక్యూరిటీ ఉంటుందని, ఒక వేళ ఎవరైన దొంగిలించినా వెంటనే కనిపెట్టవచ్చనే భావన చాలా మందిలో ఉంది. కానీ.. దొంగలించిన ముఠా ఆఫోన్ల లాక్‌ను క్షణాల్లోనే తీసేస్తున్నారు. దీంతో ఎంత ఖరీదైన ఫోన్‌ అయినా కూడా సెక్యూరిటీ ఉండదనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇలా ఫోన్‌లో చోరీకి గురైనట్లు పోలీసులను ఆశ్రయించిన వారు అధికంగా సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లే ఉండటం గమనార్హం. ఎలాంటి ఫోన్‌ అయినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

మరి ఐ-ఫోన్‌ అన్‌లాక్‌ ఎలా అవుతుంది..

ఇలా ఐఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే ఐక్లౌడ్‌లోకి వెళ్లడం ద్వారా తమ ఫోన్‌ను ‘లాస్ట్‌ మోడ్‌’లో పెడుతూ ‘బ్రాడ్‌ కాస్ట్‌మెసేజ్‌’టైప్‌ చేస్తున్నారు. దీంతో ఆ ఫోన్‌ ఎవరికి దొరికినా దాని స్క్రీన్‌ మీద 'ఈ ఫోన్‌ నేను పోగొట్టుకున్నాను' అనే మెసేజ్‌ తోపాటు బాధితుడి ఫోన్‌ నంబర్‌ డిస్‌ప్లే అవుతుంటుంది. దీనిని ఇతర దేశాల్లో ఉంటున్న హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. బల్క్‌ ఎస్సెమ్మెస్‌ సైట్లను హ్యాక్‌ చేయడం ద్వారా ఆయా బాధితుల నంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు.ఈ మెసేజ్‌లో సెండర్‌ వివరాలు డిస్‌ప్లే అయ్యే స్థానంలో ఐక్లౌడ్‌ను పోలిన పేరు ఎంటర్‌ చేస్తున్నారు. కాగా, పంజాగుట్టకు చెందిన సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ కు ఇటీవల ఇలాంటి సందేశమే వచ్చింది. ''మీరు పోగొట్టుకున్న ఐఫోన్‌ను గుర్తించాం'' అంటూ ఐసీఐఓయూడీ నుంచి సందేశం వచ్చింది. వెంటనే ఈ సందేశాన్ని చూసిన సదరు బాధితుడు అందులోని లింకును క్లిక్‌ చేశాడు. ఇంకేముంది ఇలా క్లిక్‌ చేసిన వెంటనే ఆ లింకు నేరుగా సదరు హ్యాకర్‌ సృష్టించిన ఐక్లౌడ్‌ ను పోలిన సైట్‌కు చేరిపోతుంది. అందులో ఫోన్‌ లోకేషన్‌ తెలుసుకోవాలంటే యూపిల్‌ ఐడీ,పాస్‌ వర్డ్‌ ను ఎంటర్ చేయాలని కోరుతుంది.

వెంటనే సదరు వ్యక్తి పాస్‌ వర్డ్‌, ఇతర వివరాలన్ని ఎంటర్‌ చేయడంతో ఫోన్‌ను చోరీ చేసిన ముఠాకు చేరిపోతాయి. దీని ఆధారంగానే ముఠాలు దొంగిలించిన ఫోన్‌ లాక్‌ను ఇలా సునాయాసంగా తీసేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇలా ఒకసారి అన్‌లాక్‌ చేసిన తర్వాత వాటి ఐఎంఈఐ నెంబర్లను క్లోనింగ్‌ చేసి ఎక్కడ ట్రాక్‌ కాకుండా ఏచసి ఆన్‌లైన్‌లో భారత్‌ సహా ఇతర దేశాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఐఎంఈఐ నంబర్‌ మారితే దేశంలో ఉన్నా.. ట్రాక్‌ చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఒక వేళ మారకపోయినా విదేశాల్లో ఉంటే మన పోలీసులు గుర్తించలేరు. ఈ కారణంగా పోగొట్టుకున్న ఐ-ఫోన్లు ట్రాక్‌ కావడం లేదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.

Next Story