మద్యం మత్తులో.. సొంత అన్న కుతూరుని ఏం చేశాడంటే..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Nov 2019 12:23 PM ISTవిజయవాడ: మద్యం మత్తు.. మనిషిని ఎంతటి దారుణానికైనా పురికొల్పుతుందనడానికి నిదర్శనంగా నిలిచిన ఘటన ఇది. మద్యం మత్తులో ఓ వ్యక్తి సొంత అన్న కుతూరును మూడో అంతస్తు నుంచి కింద పడేసిన దారుణ ఘటన విజయవాడ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. నున్న గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలో వాంబేకాలనీలోని కొండ్రాజు ఏసుబాబు, శ్రీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏసుబాబు తన సోదరుడైన కృష్ణతో కలిసి టైల్స్ పనులు చేస్తుంటాడు.
కృష్ణకు వివాహమైంది. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య అతణ్ని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కృష్ణ తన అన్న ఇంటి వద్దే ఎక్కువగా ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగి వచ్చిన కృష్ణకు వదిన శ్రీదేవి భోజనం పెట్టింది. మద్యం మత్తులో చెల్లాచెదురుగా అన్నం పడేయడమే కాకుండా ఆమెపై కృష్ణ దుర్భాషలాడాడు. దీంతో ఏసుబాబు జోక్యం చేసుకోవడంతో గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కృష్ణ కోపంతో ఊగిపోతూ.. అక్కడే ఉన్న ఏసుబాబు పెద్ద కుమార్తె జానకి (6)ని మూడో అంతస్తు నుంచి కిందపడేశాడు. తల వెనుక భాగంలో బలమైన గాయమై ముక్కు, చెవులు, నోటి నుంచి రక్తం వస్తుండటంతో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.