తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు

By సుభాష్  Published on  23 Jun 2020 10:48 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు

ఏపీ,తెలంగాణలో భూప్రకంపనలు సంభవించాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముందే కరోనా కాలంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ఈ భూప్రకంపనలు సంభవించడంతో భయాందోళన చెందారు. భూకంపం రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 2.2గా నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

ఇక తెలంగాణలోని నల్గొండ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని చింతలపాలెం, మేళ్ల చెరువులో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. భూకంపంతో శబ్ధాలు వచ్చినట్లు పలువురు తెలిపారు.

ఇక ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. అలాగే హర్యానాలోలోనూ పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా, ఒక్కసారిగా భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, ఓ వైపు కరోనాతో వణికిపోతుంటే..మరో వైపు వరుస భూకంపాలు చోటు చేసుకోవడంతో మరింత భయాందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో, మే 10,15,29, జూన్‌ 8వ తేదీల్లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఢిల్లీ కేంద్రంగా వరుసగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలా ఢిల్లీలో వరుస భూప్రకంపనలు హడలెత్తించాయి. గత నెల రోజుల్లోనే ఏడు భూకంపాలు నమోదు కావడం ప్రజల్లో మరింత భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతుంటే.. భూప్రకంపనల వల్ల మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Next Story