జగన్ సర్కారు అంతా ఓపెన్.. తెలంగాణలో అంతా సీక్రెట్.. అసలేం జరుగుతోంది?

By సుభాష్  Published on  1 Aug 2020 7:16 AM GMT
జగన్ సర్కారు అంతా ఓపెన్.. తెలంగాణలో అంతా సీక్రెట్.. అసలేం జరుగుతోంది?

ఒకొరికొకరు మంచి మిత్రులుగా ఉంటూ.. ఎవరి పరిధిలో వారు ఉంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కీలకమైన కరోనా టైంలో అనుసరిస్తున్న విధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కేసుల నమోదుతో పోలిస్తే.. కొన్ని రెట్లు ఎక్కువగా ఏపీలో నమోదవుతున్నాయి. మొదట్లో తెలంగాణలో కేసులు ఎక్కువగా ఉండటం.. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో నమోదైన కేసులు భారీగా ఉండటంతో బ్రాండ్ హైదరాబాద్ ను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు పాలకులకు చికాకే. అందునా తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళలో కరోనా లాంటి విపత్తు విరుచుకుపడటానికి మించిన ఇబ్బంది ఏం ఉంటుంది చెప్పండి. ఈ మాయదారి రోగాన్ని అధిగమించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాల్లో ఏ మాత్రం పోలిక లేకపోవటం విశేషంగా చెప్పాలి. ఏపీలో విషయాలన్ని ఓపెన్ గా ఉంటే.. తెలంగాణలో మాత్రం ప్రతిది రహస్యంగా ఉండిపోతున్న పరిస్థితి.

భారీగా కేసులు నమోదవుతూ.. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సీఎం జగన్ విధానాన్ని మాత్రం అందరూ అభినందిస్తుండటం ఒక కొత్త కోణంగా చెప్పాలి. ముఖ్యమంత్రిగా జగన్ ను ఏ మాత్రం ఒప్పుకోని వారు సైతం.. కరోనా విషయంలో ఆయన అనుసరిస్తున్న పద్దతులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న తీరును మాత్రం అందరూ అభినందిస్తున్నారు. కేసుల పెరుగుదల తప్పంతా ప్రజల ఖాతాలో పడటం జగన్ సర్కారు సాధించిన అరుదైన విజయంగా అభివర్ణించాలి.

ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోంది. ప్రజలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ.. నెత్తి మీదకు తెచ్చుకుంటున్నారన్న మాట ఏపీలో ప్రతి చోట వినిపిస్తోంది. నిర్దారణ పరీక్షలు భారీగా నిర్వహించటం.. ఐసోలేషన్ చర్యలు.. వైద్య సదుపాయం.. ఇలా ఏ విషయంలోనూ లోటు రాకుండా చూసుకోవటమే కాదు.. ప్రతి పేషెంట్ కు ఇచ్చే భోజనం విషయంలో రోజుకు రూ.530 వరకు చెల్లిస్తున్న తీరు ప్రశంసల్ని అందుకుంటోంది. అదే సమయంలో తెలంగాణలో రోజుకు మూడు వందలకు మించకపోవటం గమనార్హం.

నిర్దారణ పరీక్షల కోసం కిందా మీదా పడాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంటే.. ఏపీలో రోజుకు భారీ ఎత్తున చేస్తున్నారు. కేసుల నమోదు దగ్గర నుంచి మరణాల నమోదు వరకు ఏ విషయంలోనూ రహస్యం అక్కర్లేదని.. ఉన్నది ఉన్నట్లుగా.. వాస్తవాల్ని ఇచ్చేయాలని జగన్ చెబుతున్నారు. ప్రతి ఆసుపత్రి బయట బోర్డు ఏర్పాటు చేసి.. బెడ్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయన్నది స్పష్టం చేయాలని చెప్పటం చూస్తే.. కరోనా ఎపిసోడ్ లో జగన్ కమిట్ మెంట్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

దీనికి భిన్నంగా తెలంగాణ పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. నిర్దారణ పరీక్షలే కాదు.. బెడ్ల విషయంలోనూ వివరాలు బయటకు రాని పరిస్థితి. ఇక.. కేసుల నమోదు.. మరణాల వెల్లడి ఇలా అన్నింటిలోనూ తేడాలు కనిపిస్తున్నాయి. అధికారుల పని తీరు మీదా పెదవి విరుపులు వ్యక్తమవుతున్నాయి. కరోనా మీద సమీక్ష విషయంలో ఏపీ సీఎం డైలీ బేసిస్ లో చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విషయం మీద చర్చించటానికి సైతం ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తోంది.

పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఏపీ సీఎం జగన్ వడి వడిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. అలాంటిదేమీ తెలంగాణలో కనిపించని పరిస్థితి. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. కరోనా ఎపిసోడ్ లో మాత్రం ఏపీ సర్కారు ఓపెన్ గా పారదర్శకంగా ఉన్నట్లు స్పష్టమవుతుంటే.. తెలంగాణలో మత్రం అంతా గుట్టుగా.. రాజకోట రహస్యం మాదిరి ఉందన్న మాట వినిపిస్తోంది. కరోనా విధానాలు.. అమలు జరుగుతున్న తీరు లాంటి విషయంలో ఇద్దరు సీఎంల మధ్య వైరుధ్యాలు కనిపించినా.. ముఖానికి మాస్కు కట్టుకునే విషయంలో ఇద్దరు ఒకేలా వ్యవహరించటం విశేషం.

Next Story
Share it