ఏపీ ఆసుపత్రుల బయట బ్లాక్ బోర్డులు ఎందుకు?

By సుభాష్  Published on  1 Aug 2020 7:03 AM GMT
ఏపీ ఆసుపత్రుల బయట బ్లాక్ బోర్డులు ఎందుకు?

కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. ఏపీలో అయితే.. అనుకోని రీతిలో పెరిగిన కేసుల సంఖ్యను చూసి అవాక్కు అవుతున్నారు. దేశంలో నమోదయ్యే కేసుల్లో ఇరవై శాతం ఒక్క రాష్ట్రంలోనే ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఎవరికి వారు తమకు రాదన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వీలైనంతవరకు అందరిని కలవటం.. ప్రయాణాలు చేయటం.. పరామర్శలకు వెళ్లటం.. పార్టీలు చేసుకోవటం లాంటివి ఎక్కువ అవుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా కేసులు పెరిగిపోవటం.. కొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తున్న ఊపులో ఉన్న నేపథ్యంలో ఏపీలో వైద్యసేవలు అందిస్తున్న ఆసుపత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బెడ్లకు పెద్ద ఎత్తున రికమండేషన్లు అవసరమవుతున్నాయి. అదే సమయంలో ఖాళీగా ఉన్న బెర్తులు ఏమిటి? కేటాయింపులు ఎన్ని చేశారన్న వివరాలు ఎక్కడికక్కడ బయటకు రావట్లేదు. దీంతో.. వివరాలు వెల్లడి కాక కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో..కొత్త విధానానికి తెర తీశారు సీఎం జగన్.

ప్రతి కోవిడ్ ఆసుపత్రి బయట బ్లాక్ బోర్డు ఉంచాలని నిర్ణయించారు. ఇందులో ఖాళీ అయిన బెడ్లు.. భర్తీ అయిన బెడ్ల వివరాల్ని పేర్కొనాలని చెబుతున్నారు. ఒకవేళ ఎవరికైనా బెడ్ లేదన్న ఫిర్యాదు వస్తే.. వారున్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఆసుపత్రుల్లో బెడ్ కేటాయింపు హెల్ప్ డెస్కుల ద్వారా జరగాలని ఆదేశించారు. కాల్ సెంటర్ల పని తీరును సమీక్షించటం.. కోవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందేందుకు వీలుగా ఏర్పాట్లు మరింత పెంచాలని కోరుతున్నారు.

ఓవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కొత్త విధానాల్ని వరుస పెట్టి అమల్లోకి తీసుకొస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. అత్యవసర మందుల్ని అందుబాటులోకి తేవాలని.. కీలకంగా మారిన ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5వేలు ప్రోత్సాహాన్ని ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సెప్టెంబరు ఐదు నుంచి స్కూళ్లు తెరవాలన్న పట్టుదలతో ఉన్న సీఎం జగన్.. పిల్లలకు మాస్కులు ఇవ్వాలని.. వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత పారదర్శకంగా ఉండటంతో పాటు.. రోగులకు అవసరమైన సేవలు అందేందుకు వీలుగా జగన్ ప్లాన్ చేసిన బ్లాక్ బోర్డు విధానం ప్రాక్టికల్ గా ఎంతమేర సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Next Story