నిమ్మగడ్డ రమేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ స్పీకర్‌

By సుభాష్  Published on  16 March 2020 11:05 AM GMT
నిమ్మగడ్డ రమేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ స్పీకర్‌

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంపై ఈసీపై జగన్ సర్కార్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌పై జగన్‌ సర్కార్‌ దుమ్మెత్తిపోస్తోంది. ఓ వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్‌ ఆరోపిస్తుండగా, పలువురు వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక తాజాగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా ఎన్నికల కమిషన్‌, టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై నిమ్మగడ్డ రమేష్‌ కనిపిస్తే ప్రజలు కొట్టేలా ఉన్నారని వ్యాఖ్యనించారు. అయితే ఎన్నికల కమిషన్‌ను తాము గౌరవిస్తామని అన్నారు. ఎన్నికల కమిషనర్‌ కుర్చీలో కాకుండా ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చోమనండి అంటూ రమేష్‌పై ఘాటుగా వ్యాఖ్యనించారు.

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్దంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నోటిఫికేషన్‌ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని, రాష్ట్ర సర్కార్‌పై ఈసీ పెత్తనం ఏంటని మండిపడ్డారు.

ఇక చంద్రబాబు వంటి వారు నీచరాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి నాయకులు ఉన్నంత వరకు వ్యవస్థలకు పట్టిన భ్రష్టు వదలదని స్పీకర్‌ వ్యాఖ్యనించారు. రాష్ట్ర సర్కార్‌పై ఈసీ పెత్తనం ఏమిటని, రాష్ట్రానికి కరోనా వైరసా.. లేక కమ్మ వైరసా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 2019 ఎన్నికల సమయంలో కూడా సీఎస్‌ మార్చితే చంద్రబాబు రాద్దాంతం చేశారని, ఇప్పుడు అధికారుల బదిలీపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు వంటి చీడపురుగు ఉండకూడదని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Next Story
Share it