ముఖ్యాంశాలు

  • ఏపీ నుంచి ఖాళీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు

  • మూడు స్థానాలకు అభ్యర్థులను ఓకేచేసిన సీఎం జగన్‌

  • నాలుగో వ్యక్తి నత్వానీనా.. వైకాపా నేతలుంటారా?

అధికార పార్టీ వైకాపాలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభకు ఏపీ నుంచి నాలుగు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటికే వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ముగ్గురికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది. మిగిలిన నాలుగో స్థానంకు ఎవరిని ఎంపిక చేస్తారానని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నాలుగో స్థానం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పరిమళ్‌ నత్యానీకి అవకాశం ఇస్తారా..? లేక వైకాపా సీనియర్‌ నేతలకు అవకాశం ఇస్తారాని అని వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2020 రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో ఇప్పటికే కొంత మంది అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం నుంచి మార్చి 13వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16న నామినేషన్‌ పత్రాలను పరిశీలిస్తారు. మార్చి 18లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్‌ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వనుండగా. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో మొహద్‌ అలీఖాన్‌, టి. సుబ్బరామిరెడ్డి, కె. కేశవరావు, తోటా సీతారామ లక్ష్మీ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ముగుస్తోంది.

ముగ్గురికి గ్రీన్‌సిగ్నల్‌..

ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కొద్దిరోజులుగా వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి సమాలోచనలు చేస్తున్నారు. పలువురి సీనియర్‌ నేతలను సంప్రదిస్తూ పేర్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లాకు చెందిన అయోధ్య రామిరెడ్డిల పేర్లు మూడు స్థానాలకు దాదాపు సీఎం జగన్మోహన్‌రెడ్డి ఖరారుచేసినట్లు వైసీపీ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. తప్పని సరిఅయితే తప్ప వీరిముగ్గురి ఎంపికలో మార్పుఉండదని తెలుస్తోంది. మరోవైపు మిగిలిన నాలుగో స్థానం నుంచి ఎవరిని రాజ్యసభకు పంపిస్తారనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

సత్యంత్ర అభ్యర్థి పరిమల్‌ నత్వాని, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తాన్‌రావుల పేర్లను సీఎం జగన్మోహన్‌రెడ్డి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల రియల్స్‌ అధినేత  ముకేశ్‌ అంబానీ తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినప్పుడు రియలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్‌ నత్వానీనితిరిగి రాజ్యసభకు పంపేందుకు ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రచారం సాగుతుంది. దీంతో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నాలుగో వ్యక్తి ఆయనే అయ్యి ఉంటారని వైసీపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. దీనికి కారణంగా.. నత్యానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే రియల్స్‌ నుంచి భారీగా పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలుంటాయని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. జగన్‌ ఆ రీతిలో ఆలోచిస్తే ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేనాలుగో వ్యక్తి నత్వానీనే కావటం ఖాయమని చర్చసాగుతుంది. మరి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నాలుగో వ్యక్తి వైకాపా పార్టీ నేత అయ్యి ఉంటారా.. లేక నత్వానీ అవుతాడా వేచి చూడాల్సిందే.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.