ఏపీ పోలీస్‌ సేవ యాప్‌.. 87 రకాల సేవలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2020 7:10 AM GMT
ఏపీ పోలీస్‌ సేవ యాప్‌.. 87 రకాల సేవలు

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ బాధితులు స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’ పేరిట ఈ యాప్‌‌ నేడు అందుబాటులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల సేవలను ఇంటిదగ్గరే ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు.. ఫిర్యాదులకు రశీదు కూడా పొందే విధంగా యాప్ తయారు చేశారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని భావిస్తున్న ఈ యాప్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. వాట్సాప్, ఫేస్‌బుక్,ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదుతో పాటు అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ చేసే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ తో‌ పాటు డీజీపీ గౌతవ్‌ సవాంగ్‌ ముఖ్య పోలీసు అధికారులు పాల్గొన్నారు. యాప్‌ విశిష్టతను సీఎంకు వివరించారు. ఈ యాప్‌ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ పోలీస్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు డీజీపీ తెలిపారు.

యాప్‌లో అందించే సేవల్లో కొన్ని

శాంతి భద్రతలు:

- నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు

- ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌

- దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు

- తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు

- అరెస్టుల వివరాలు

- వాహనాల వివరాలు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు :

- ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌)

- ఇ–చలానా స్టేటస్‌

పబ్లిక్‌ సేవలు:

- నేరాలపై ఫిర్యాదులు

- సేవలకు సంబంధించిన దరఖాస్తులు

- ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు

- లైసెన్సులు, అనుమతులు

- పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌

రహదారి భద్రత:

- బ్లాక్‌ స్పాట్లు

- యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌

- రహదారి భద్రత గుర్తులు

- బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు

ప్రజా సమాచారం:

- పోలీస్‌ డిక్షనరీ

- సమీపంలోని పోలీస్‌స్టేషన్‌

- టోల్‌ఫ్రీ నంబర్లు

- వెబ్‌సైట్ల వివరాలు

- న్యాయ సమాచారం

- ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు



Next Story