లడ్డూ ధర పెంపు దుష్ప్రచారాన్ని ఖండించిన టీటీడీ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Nov 2019 2:03 PM ISTముఖ్యాంశాలు
- అలాంటి ఆలోచనే లేదన్న టీటీడీ చైర్మన్
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా తిరుమల తిరుపతి వాసికెక్కింది. తిరుమల బాలాజీకి ఎంత పేరుందో ఆయన ప్రసాదమైన లడ్డూకు కూడా అంతే పేరుంది ప్రపంచవ్యాప్తంగా. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు సాక్షాత్తూ కలివైకుంఠవరదుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకుని తరించిన అనుభూతిని పొందుతారు. లడ్డూ ప్రసాదాన్ని ఏడుకొండలవాడి ఆశీర్వాదంగా భావిస్తారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న రుచి ప్రపంచంలో ఇంకే లడ్డూకూ ఉండదన్నది భక్తకోటి విశ్వాసం.
తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ కేటగిరీల్లో రోజు కనీసం నాలుగు లక్షల లడ్డూలను భక్తులకు ప్రసాదంగా అందజేస్తుంది. అసలు లడ్డూధర రూ.10. మరో కేటగిరీలో రూ.25. అదనపు లడ్డూలు కావాలంటే రూ.50 చొప్పున ఒక్కొక్క లడ్డూకు చెల్లించి పొందవచ్చు. ఈ సౌలభ్యానికి కూడా పరిమితి ఉంది.
అంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక మండలి సభ్యులను పూర్తిగా మార్చేసింది. కొత్తగా ఏర్పాటైన కార్యనిర్వాహక మండలి టీటీడీ పరిపాలనలో అనేక విధాలైన కొత్త మార్పులు చేర్పులు చేసింది. త్వరలోనే లడ్డూ ధరను రూ. 50కి పెంచబోతున్నారంటూ ఆధారం లేని కథనాలు మీడియాలో గట్టిగా ప్రచారమయ్యాయి.
కొన్ని వెబ్ ఛానళ్లు, సైట్లలో అయితే టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి క్రిస్టియన్ మతస్తుడనీ, ఆయన శ్రీవారి సొమ్మును దోచేస్తున్నారంటూ విష ప్రచారంకూడా జరిగింది.
నిజనిర్ధారణ
న్యూస్ మీటర్ బృందం ఈ ఆరోపణలు, వార్తల్లోని నిజానిజాలను నిర్ధారించేందుకు ప్రత్యేకమైన పరిశోధన చేసింది. న్యూస్ మీటర్ ప్రతినిధి నేరుగా టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని దీని గురించి ప్రశ్నించినప్పుడు, లడ్డూ ధరను పెంచడానికి ఎలాంటి ప్రతిపాదనా చేయనేలేదని ఆయన జవాబిచ్చారు. విష ప్రచారాన్ని పూర్తిగా అడ్డుకునేందుకు ఆయన నేరుగా దీనిపై వివరణను ట్వీట్ చేశారు.