అది సీఎం రమేశ్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుకా... లేక రాజకీయ వేదికా..?

By అంజి  Published on  24 Nov 2019 12:52 PM GMT
అది సీఎం రమేశ్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుకా... లేక రాజకీయ వేదికా..?

ముఖ్యాంశాలు

  • అంగరంగ వైభవంగా సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుక
  • 15 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సీఎం రమేష్‌
  • ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారంటూ సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
  • వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తోంది: లోకేష్‌

దుబాయ్‌లో బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. దుబాయ్‌లోని వాల్డార్ఫ్‌ అస్టోరియా హోటల్‌లో నిశ్చితార్థ వేడుకలు జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకలకు పలు పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా సీఎం రమేష్‌ భారత్‌ నుంచి 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ్య వ్యాపారేవేత్త.. ఆలూరి రాజా కుమార్తె పూజతో సీఎం రమేష్‌ కుమారుడి రిత్విక్‌ పెళ్లి జరగనుంది. ఆలూరి రాజా కుటుంబం మొత్తం అమెరికాలో సెటిల్‌ అయ్యింది. గతంలో సీఎం రమేష్‌ ఉక్కు దీక్ష చేసినప్పుడు కడపలో వైద్యపరీక్షలు నిర్వహించింది ఆలూరి రాజా దంపతులే. కాగా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను సీఎం రమేష్‌ నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నిశితార్థ వేడుక రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు సీఎం రమేష్‌ తన కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో చేస్తూ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు సీఎం రమేష్‌ 15 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పలువురు నేతలను బీజేపీలో చేర్చుకునేందుకే సీఎం రమేష్‌ దుబాయ్‌లో తన కుమారుడి నిశ్చితార్థ వేడుకలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యంగాన్ని ప్రధాని మోదీ, అమిత్‌ కుప్పకూల్చారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, సీబీఐ సంస్థలకు స్వతంత్రత లేకుండా చేశారని సీపీఐ నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మహారాష్ట్రలో ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. బీజేపీయేతర రాష్ట్రాలను అణగదొక్కాలని చూస్తున్నారని.. కేసీఆర్‌, జగన్‌ అప్రమత్తంగా లేకపోతే జరగాల్సిన నష్టం.. జరుగుతుందన్నారు.

తాను బీజేపీ నేత సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ నేత లోకేష్‌ స్పందించారు. సీఎం రమేష్‌ కొడుకు నిశ్చితార్థానికి వెళ్లానని అసత్య ప్రచారం చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుందన్నారు. అకౌంట్ లో వైఎస్‌ జగన్‌ చిల్లర పడితే చాలు ఇంగిత జ్ఞానం లేకుండా రెచ్చిపోతున్నారని లోకేష్‌ మండిపడ్డారు. సీఎం రమేష్ కొడుకు పెళ్లికి లోకేష్ దుబాయ్ వెళ్లాడు అని 2015లో నేను అమెరికా పర్యటనకు వెళ్లిన పాత ఫొటోలతో కొత్త కథ అల్లి.. అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Next Story
Share it