చంద్రబాబుకు అధికారం పోయాకే.. బీసీలు గుర్తొచ్చారా.?

By అంజి  Published on  22 Feb 2020 9:09 AM GMT
చంద్రబాబుకు అధికారం పోయాకే.. బీసీలు గుర్తొచ్చారా.?

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ప్రతి విషయానికి కులాలు, మతాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. తప్పుడు రాజకీయాలు చేయొద్దని మంత్రి అనిల్‌ అన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో దొంగలు ఎవరు అన్నది.. విచారణలో నిజనిజాలు తెలుతాయన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో రాష్ట్రాన్ని వాడుకోసవడం సరికాదని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు.

అవినీతిపై విచారణ అంటేనే బీసీ కులాలు గుర్తుకు రావడం సిగ్గుచేటన్నారు. నంద్యాల ఎన్నికల్లో ఉన్న తనకు బెట్టింగ్‌ నోటీసు ఇచ్చినప్పుడు.. తాను బీసీనని మార్చిపోయావా.. అంటూ చంద్రబాబుని విమర్శించారు. చంద్రబాబుకు ఆరోజు అధికారం ఉంది కదా అని ఒక బీసీ వర్గానికి చెందిన తనపై కావాలని కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు బీసీలు గుర్తురాలేదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. నోరు ఉంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉరుకోమన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబును మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేననన్నారు.

చంద్రబాబుకు అధికారం పోయాకే.. బీసీలు గుర్తొచ్చారా అంటూ మత్రి అనిల్‌ ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని వందలు, వేల కోట్ల రూపాయలు కొట్టేసినప్పుడు గుర్తుకురాని బీసీలు.. స్కామ్‌లు చేసి అడ్డంగా దొరికిన తర్వాత గుర్తొచ్చారా.. అని మంత్రి అనిల్‌ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను, మిన్ను కానకుండా బీసీల మీద, తన మీద కేసులు పెట్టినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా..? అంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు.

Next Story