ఏపీలో నేటి నుండి మ‌త్స్య‌కార భ‌రోసా చెల్లింపులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 May 2020 9:46 AM IST
ఏపీలో నేటి నుండి మ‌త్స్య‌కార భ‌రోసా చెల్లింపులు

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 వేలకు పెంచింది. అయితే.. గత ఏడాది మత్స్యకార దినోత్సవం రోజు ఆ మొత్తం చెల్లించగా.. ఈసారి మాత్రం మే నెలలోనే వారికి ఆర్థిక సహాయం చేస్తోంది. లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు బుధవారం నాడు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. మత్స్యకారులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకంలో బాగంగా ప్రభుత్వం ఈ రోజు చెల్లింపులు చేయనుంది.

మత్స్యకార కుటుంబాలకు 2018 వరకు.. రూ.4 వేల చొప్పున సహాయం చేయగా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు వై‌సీపీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. అంతే కాకుండా 2018 వరకు వరకు మర పడవల్లో చేపల వేటకు వెళ్లే వారికి మాత్రమే ఆ సహాయం అందించ‌గా.. 2019 వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి దేశీయ నాటు, తెడ్డు, తెరచాప సహాయంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా రూ.10 వేలు చెల్లిస్తున్నారు. గత ఏడాది నవంబరు 21న మత్స్యకార దినోత్సవం రోజున ఆ సహాయం అందించగా.. ఈసారి 6 నెలల ముందుగానే.. మత్స్యకారుల బ్యాంక్‌ ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.10 వేల చొప్పున జమ చేస్తున్నారు.

Next Story