అమరావతి: శాసనమండలి భవిత్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం శాసనసభలో మండలి రద్దుపై తీర్మానం పెట్టి ఆమోదించనున్నారు. శాసనసభలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చ జరగనుంది.

మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో 2/3 వంతుల మద్దుత ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169 ప్రకారం మండలి ఏర్పాటు, రద్దు చేయవచ్చు. తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి పంపాలని యోచిస్తున్నారు. కాగా మండలి రద్దుపై కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తప్పనిసరి, అలాగే పార్లమెంట్‌లో కూడా బిల్లు ఆమోదం పొందాలి. అనంతరం రాష్ట్రపత్రి ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేస్తారు. కేంద్రం ఒప్పుకుంటే శాసనమండలి త్వరగానే రద్దయ్యే అవకాశాలున్నాయి. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది.

కాగా ఇవాళ అసెంబ్లీకి వెళ్లకూడదని టీడీఎల్పీ నిర్ణయించుకుంది. మరోవైపు శాసనసభ, మండలి నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే అంశంపైనా మంత్రివర్గంలో సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలి రద్దు నేపథ్యంలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. మండలిపై ప్రభుత్వ నిర్ణయంతో మంత్రులు పిల్లి సుభాష్‌, మోపదేవి తమ పదవులు కోల్పోనున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.