రాపాక, గొట్టిపాటి క్యూలో ఉన్నారా? ఇక సిగ్నల్ రావడమే మిగిలిందా?
By అంజి Published on 26 Nov 2019 2:06 PM ISTఏపీలో అధికార పార్టీలో చేరేందుకు పలువురు నేతలు రెడీ అవుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఓ రౌండ్ సంప్రదింపులు పూర్తి చేశారట. వైసీపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావమే మిగిలిందట. ఒక్కసారి సిగ్నల్ వస్తే జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
డైలామాలో గొట్టిపాటి.!
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి పార్టీ మారే విషయంలో డైలామాలో పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఈయన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగానే ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన కండువా మార్పిడికి షరతులు అడ్డు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆయన వైసీపీలో ఉన్నారు. అక్కడ నేతలతో పరిచయాలు ఉన్నాయి. కానీ పార్టీమారితే రాజీనామా చేయాల్సి రావడంపై ఆయన తర్జనభర్జన పడుతున్నారట.
ఒక్కసారి కండువా మార్పిడి జరిగితే ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఆయనకు రాదని తెలుస్తోంది. అద్దంకి నుంచి గరటయ్యకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. దీంతో గొట్టిపాటి పర్చూరుకు ట్రాన్స్‌ఫర్ కావాల్సిన పరిస్థితి. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, దీంతో గొట్టిపాటి డైలామాలో పడ్డారట. ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.
ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మనవడి పుట్టినరోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ బర్త్‌డే ఫంక్షన్‌కు గొట్టిపాటి కూడా వచ్చారు. ఇక్కడే పార్టీ మారే విషయంపై ఆయనతో మంత్రులు చర్చించారట. అయితే తన పరిస్థితిని వాళ్లకు వివరించారని తెలుస్తోంది. అయితే హైకమాండ్ మాత్రం గొట్టిపాటి విషయం చాలా క్లియర్‌గా ఉందట. వెంటనే ఆయన్ని పార్టీలోకి తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నారని ఆలోచన చేస్తున్నారట. ఇందులో భాగంగానే గొట్టిపాటికి చెందిన క్వారీలపై అధికారులు దాడులు చేస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
రాపాక రాజకీయ దారెటు..?
రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇటీవల టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిశారు. కాకినాడ ఎంపీ వంగా గీతతో పాటు జిల్లా ప్రముఖులతో కలిసి వైవితో మీటింగ్ అయ్యారు. గోదావరి జిల్లాల వైసీపీ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి. దీంతో రాపాక పార్టీమారేందుకు వైవిని కలిశారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. జిల్లా నేతలతో మాట్లాడేందుకు ఈ సమావేశం జరిగిందని సమాచారం. రాపాక కూడా కండువా మార్పిడికి క్యూలైన్‌లో ఉన్నారని టాక్.
మొత్తానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే అంశంపై తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే వీరి పార్టీ మార్పుపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.