ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..!
By అంజి Published on 27 Nov 2019 4:10 PM ISTఅమరావతి: రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపు నేస్తం పథకానికి మంత్రి వర్గం ఆమోదించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద ప్రభుత్వం రూ.1,101 కోట్లు కేటాయించింది. కాపు సామాజిక వర్గం మహిళలలకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించనుంది. 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళలకు ఐదేళ్లలో రూ.75 వేలు ప్రభుత్వం ఇవ్వనుంది. సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి ఈ పథకం వర్తించనుంది. 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాలలోపు మెట్ట ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. నవశకం సర్వే ద్వారా కాపు నేస్తం లబ్దిదారులను ఎంపిక చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు.
కొత్తరేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే బియ్యం కార్డులు కూడా జారీ చేయనుంది. ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, కార్డుల జారీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. ఐటీఐ విద్యార్థుకుల రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రభుత్వం రూ.15 వేలు సాయం అందించనుంది. డీగ్రీ, ఉన్నత విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.
జగనన్న విద్యా దీవెన
జగనన్న విద్యా దీవెన పేరుతో విద్యార్థుకుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.3,400 కోట్లు కేటాయించింది. రూ.2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి విద్యా దీవెన పథకం వర్తించనుంది. అదే విధంగా సీపీఎస్ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్ కమిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో ఆశావర్కర్ల జీతం రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ సమక్షంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పేదరికమే అర్హతగా లబ్దిదారులను ఎంపిక చేస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇళ్ల పట్టాలపై పేదలకు హక్క కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌కు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను కేబినెట్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కిందకు తీసుకొచ్చింది.
టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. విశాఖ జిల్లా పరవాడలో ఏపీఐఐటీకి 50 ఎకరాల భూమి కేటాయింపుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎక్సైజ్‌లో సవరణలకు ముసాయిదా బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, నిర్మాణానికి ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. దీని కోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం 3,925 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇనుప ఖనిజం కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు.
షెడ్యూల్డ్ కేస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు వేర్వేరుగా కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ స్టేట్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ కేస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశా్లో వేర్వేరు కమిషన్లు ఏర్పాటుకు బిల్లు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పరిధిలోకి ఇంటర్ విద్యను చేర్చుతూ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణంకోసం ద.మ. రైల్వేకు 92.05 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు మంత్రులు ఆమోదం తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సంబంధిత అంశాలపై మంత్రుల బృందం(జీఓఎం) కు సలహాలు, సూచనల కోసం అధికారుల బృందం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన అటవీ,పర్యావరణ, ఆరోగ్య, పంచాయితీరాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలవిద్యాశాఖ కార్యదర్శలతో కూడిన బృందాన్ని కేబినెట్ ఏర్పాటు చేసింది. అధికారుల బృందానికి ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి కన్వినర్‌గా వ్యవహరించనున్నారు.