తెలుగు భాష పనికిరాదని వాళ్లు అనడం మన దౌర్భాగ్యం..!

By అంజి  Published on  26 Nov 2019 1:54 PM IST
తెలుగు భాష పనికిరాదని వాళ్లు అనడం మన దౌర్భాగ్యం..!

కడప: దేశవ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యంగ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని హరిత టూరిజం హోటల్‌ నందు జరిగిన ఓ రాజ్యంగ దినోత్సవ వేడుకల్లో.. బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడారు. 2015 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్‌ 26న దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవం 'సంవిధాన్‌ దివాస్‌'ను జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించారని మాధవ్‌ అన్నారు.

అంబేద్కర్‌ ప్రపంచ నాయకుడు అని తెలిపే విధంగా ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి సంబంధించి అనేక ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగు మాధ్యామాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యంగ విరుద్ధమన్నారు. గతంలో టీడీపీ తెచ్చిన జీవో 14, ప్రస్తుత ప్రభుత్వం 81, 72 జీవోలు రాజ్యాంగ ఉల్లంఘన, భాషా ద్రోహం కిందకు వస్తాయన్నారు. తెలుగు భాష పనికిరాదు అని మన పాలకులు మాట్లాడటం దౌర్భాగ్యమన్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలో భాష కోసం వాళ్లు చేస్తున్న ప్రయత్నం గమనించాలన్నారు. తెలుగు భాష వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రావన్న అభిప్రాయం అవివేకమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు.

Next Story