ముహూర్తం ఖరారైనట్లేనా..!

By సుభాష్  Published on  20 Feb 2020 3:48 PM GMT
ముహూర్తం ఖరారైనట్లేనా..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఏపీలో పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జగన్‌ దూసుకుపోతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మోదీతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సుదీర్ఘంగా గంటన్నర పాటు చర్చించారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్‌కు ఎలాంటి లాభం వచ్చిందనే విషయం అటుంచితే.. కొంత లాభదాయకమనే చెప్పాలి. జగన్‌ను మాత్రం ఢిల్లీ పెద్దలు ఒక కొత్త మిత్రుడిలా స్వాగతించారు. జగన్‌ రెండు సార్లు ఢిల్లీ వెళ్లడంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఎన్డీఏలో చేరినట్లేనని రాజకీయ విశ్లేషకుల్లో చర్చలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ ఈసారి కేబినెట్లోకి తీసుకోవడం దేశ రాజకీయాల్లో పెద్ద ఆకర్షణగా మారనున్నట్లు తెలుస్తోంది. మోడీ సర్కార్‌ వైసీపీ మొదటి నుంచే గాలం వేస్తోంది. ఎన్డీఏలో చేరితే రెండు కేంద్ర పదవులు ఇస్తామని హామీ ఇవ్వగా, ఇప్పుడు ఆ పదవులు మూడుకు చేరినట్లు తెలుస్తోంది.

ఆ జాబితాను జగన్‌ అమిత్‌ షా చేతిలో పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కాగా, అందులో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు లేనట్లు తెలుస్తోంది. ముందుగా విజయసాయిరెడ్డికి మంత్రి పదవి ఖరారు చేసినా ..ఆయన మీద సీబీఐ కేసులు ఉండటంతో చివరి నిమిషంలో ఆయనను పక్కకు తప్పించారని వార్తలు వస్తున్నాయి.

ఇక లోక్‌ సభలో వైసీపీ నేత మిథున్‌రెడ్డికి స్థానం దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరికి కూడా సహాయ మంత్రలుగా ఇవ్వనున్నట్లు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అలాగే ఆ ముగ్గురిలో మహిళా కోటలో కాపు నేత వంగా గీత కూడా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే విశాఖలో పాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తున్నందు వల్ల కృష్ణా జిల్లాలకు ఒక మంత్రి పదవి, రాయలసీమకు ఒక పదవి, గోదావరి జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవిగా ఇచ్చేందుకు జగన్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు జగన్‌ రెడీ అయ్యారని తెలుస్తోంది. వచ్చే నెలలో నాలుగు సీట్లు ఖాళీ కానున్న నేపథ్యంలో ఈ సీట్లలో నుంచి తమ కోటాలో ఒక సీటును కేటాయించాలని కమళనాథులు జగన్‌ను కోరగా, దానికి జగన్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇది కనుక జరిగితే వైసీపీకి మూడు సీట్లు మిగలనున్నాయి. ఏదీఏమైనా అటు బీజేపీ అధిష్టానం.. ఇటు జగన్‌ అనుకున్న ప్లాన్‌ సక్సెస్‌ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Next Story