ఏపీకి పెట్టుబడులు రావన్న వారికి చెంప పగిలే వార్త..!
By అంజి Published on 11 Feb 2020 8:41 AM IST
అమరావతి: జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరిగిపోతోంది అని ప్రజలను నమ్మించేందుకు వైసీపీ ప్రత్యర్ధి పార్టీ, దాని అనుబంధ మీడియా నెలకో అంశాన్ని తెరపైకి తెచ్చి హడావుడి చేస్తూనే ఉన్నాయి. తొలుత ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఆ ప్రత్యర్ధి పార్టీ అధినేత హడావుడి చేశారు.
ఆ ఘట్టం ముగిసిన తరువాత ఇసుక కొరత అంటూ రెండు నెలలపాటు రచ్చ చేశారు. ఆ తరువాత ఇంగ్లీషు వద్దు పేద పిల్లలు తెలుగులోనే చదువుకోవడమే ముద్దు అంటూ ఆయన, ఆయన మీడియా ఉద్యమం చేసింది. ఇప్పుడు గత 50 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు.
అమరావతి రాజధానిగా ఉంటే భారత దేశానికి చైనా నుండి కూడా భవిష్యత్తులో రక్షణ లభిస్తుంది అర్ధం పర్ధం లేని కథనాలను కూడా రాస్తూ ఈ ఉద్యమాన్ని మీడియా నడిపిస్తోంది. అయితే, రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేయడం, హైకోర్టులో కూడా పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రభుత్వ సంస్థలను అమరావతి నుండి ఇతర ప్రాంతాలకు తరలించకూడదు అని చట్టంలో ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించింది.
ప్రజల్లో కూడా ఆ వైసీపీ ప్రత్యర్ధి పార్టీకి రాజధాని 23 గ్రామాలు తప్ప మిగిలిన రాష్ట్రం పట్టదా..? అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్ని ఒకవైపు నడుపుతూనే మరోవైపు కొత్త అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీ అనుకూల మీడియా తెరపైకి తెచ్చింది.
నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టుబడులు పారిపోతున్నాయంటూ కొత్త ఎపిసోడ్‌కు తెరలేపింది మీడియా. కియా వెళ్లిపోతుందంటూ ఒక వార్తా సంస్థ రాసిన గాలి వార్త సాయంతో ఏపీలో ఇక పరిశ్రమలు ఉండవు, పెట్టుబడులు రావు అంటూ ఆ ప్రత్యర్ధి పార్టీ పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. ఇక ఏమున్నదక్కో అంటూ ఆ పార్టీ పత్రికలు అధినేత స్వరాన్ని అందుకున్నాయి.
కానీ, ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు తాము ఏపీని వదిలివెళుతున్నట్టు స్వయంగా ప్రకటించింది లేదు. పైగా పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్నాయి. తాజాగా, అనంతపురం జిల్లాలో రూ.580 కోట్లతో తుపాకి, బుల్లెట్ల తయారీ కంపెనీ తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఏఐఐబీ బ్యాంక్ ఏపీలో అభివృద్ది పనులకు రూ.21 వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కూడా ఈ వారంలోనే.
దొనకొండ వద్ద ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ ఏరోస్పేస్ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బోయింగ్ ఎయిర్‌బస్ జాకబ్స్ వంటి సంస్థిలు కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. కానీ, ఇటువంటి విషయాలను మాత్రం ప్రచురించకుండా ఆ ప్రత్యర్ధి పార్టీ పత్రికలు ఏపీ నుండి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ రాయడాన్ని బట్టి కొత్తగా వచ్చే పెట్టుబడులు రాకుండా కంపెనీలను బెదరగొట్టడమే ఈ పత్రికల ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఏపీకి ద్రోహం చేయడమేనా..
వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి కంపెనీలు వెనక్కు తగ్గుతున్నాయంటూ ఆ ప్రత్యర్ది పార్టీ, దాని అనుబంధ పత్రిక చెప్పుకొచ్చాయి. ఆ విషయానికే వస్తే బెదిరింపుల గురించి వైసీపీ ప్రత్యర్ధి పార్టీనే చెప్పాలి మరీ. నాడు ఆ పార్టీ అధినేత సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే బ్రిటన్ కంపెనీ వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించేందుకు ముందుకు వస్తే 150 ఎకరాల భూమిని కేటాయిస్తామంటూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
భూమి బదలాయింపుకు డిపాజిట్ కింద ఆ కంపెనీ నుండి రూ.25 కోట్లను కూడా సీఆర్డీఏ వసూలు చేసింది. కానీ, ఆ తరువాత భూమని బదలాయించకుండా ఆ కంపోనీకి ఆ కంపెనీకి మూడు చెరువుల నీళ్లు తాగించారు వైసీపీ ప్రత్యర్ధి పార్టీ అధినేత. 40 లేఖలు రాసిన తరువాత కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఆఖర్లో చంద్రబాబు మనుషులు కంపెనీ ప్రతినిధుల వద్దకు వెళ్లి 150 ఎకరాల భూమిని కేటాయించాలంటే ఎకరాకు కోటి చొప్పున 150 కోట్లను కమీషన్‌గా ఇవ్వాలి, నిర్మించే ఆస్పత్రిలో 25 శాతం వాటా తమకు ఇవ్వాలంటూ కండీషన్ పెట్టారు.
దాంతో చెల్లించిన డిపాజిట్‌ను కూడా వదిలేసి ఆ కంపెనీ ఆయన హయాంలో పారిపోయింది. ఆయన హయాంలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ సంస్థ సీఈవో డా.అజయ్ రంజన్ గుప్తానే అప్పట్లో స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరించారు. వైసీపీ ప్రత్యర్ధి పార్టీ అధినేత తన హయాంలో ఇలా పెట్టుబడిదారులను వేధించారు కాబట్టి ఇప్పుడు కూడా అలానే జరుగుతూ ఉండవచ్చు అని ఊహించుకుని కథనాలు రాయడం మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేయడమే.
ఏపీ నుండి పెట్టుబడులు పారిపోతున్నాయంటూ పనిగట్టుకుని మరీ మీడియా చేస్తున్న ప్రచారం వెనుక ఉద్దేశం ఏపీపై ప్రేమనో లేక జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు చేస్తున్న రాజకీయ ప్రయత్నమో తెలుసుకోలేనంత అమాయకులైతే ఏపీ ప్రజలు కాదనే నమ్మాలి. సుదీర్ఘ కాలంపాటు అమరావతి వార్తలే రాస్తే ప్రజలకు బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు సమాంతరంగా పెట్టుబడి కథనాలను కూడా రాస్తున్నట్టుగా అనిపిస్తుంది.