ఏపీ ఐసెట్ 2020 ఫలితాల విడుదల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2020 4:16 AM GMT
ఏపీ ఐసెట్ 2020 ఫలితాల విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షలో 78.65 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామమోహన్ రావు తదితరులతో కలిసి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఐసెట్ 2020 ఫలితాలను వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 51,991 మంది హాజరు కాగా.. 40,890 మంది అర్హత సాధించారని మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో.. పురుషులు 78.28శాతం, మహిళలు 79.08శాతం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 30 నుంచి ఐసెట్ ర్యాంకు కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. మొదటి పది ర్యాంకుల్లో నలుగురు యువతులు ఉన్నారు. రికార్డ్‌ టైంలో ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. సెప్టెంబరు 10, 11న పరీక్షలు నిర్వహించామని.. కేవలం 15రోజుల వ్యవధిలనే పరీక్ష ఫలితాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మొదటి-10 ర్యాంకుల్లో ఆరుగురు వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాలకు చెందినవారే ఉన్నారని మంత్రి తెలిపారు. కరోనా కారణంగా పరీక్షలు రాయని విద్యార్థులకు అక్టోబర్‌ 7న మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఐఐఐటీ అడ్మిషన్ల గురించి మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ.. సాధారణంగా పదో తరగతి పరీక్షల ద్వారా ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్స్ జరుగుతాయి. ఈసారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ నిర్వహిస్తామని, ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టెన్త్ సిలబస్‌ ఆధారంగా ట్రిపుల్‌ ఐటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. నవంబర్‌ మొదటి వారంలో పరీక్ష నిర్వహించాలని యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

Next Story