30 లక్షల పేద కుటుంబాలకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్
By సుభాష్ Published on 7 July 2020 2:14 PM ISTఆగస్టు 15వ తేదీన ఏపీలోని 30 లక్షల పేద కుటుంబాలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రూ.20 వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల పేద కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని జగన్ తెలిపారు.
ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు, ఆ రోజు రాష్ట్రంలోని పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని అనుకుంటున్నానని అన్నారు. ధర్మం ఎప్పుడైన చివరకు గెలుస్తుందన్న నమ్మకం ఉందని, మంచి ఆలోచనతో మనం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని, దురదృష్టవశాత్తు టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. డి-పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఇప్పటికిప్పుడే ఇళ్ల పట్టాలు ఇవ్వవచ్చని, అయితే డి- పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్లు అవుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
చరిత్రలో ఇదే తొలిసారి
అయితే 30 లక్షల కుటుంబాలకు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తి ఇవ్వనున్నామని, రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే ఈ పట్టాల పంపిణీ కలెక్టర్లు ఫోకస్ పెట్టాలన్నారు. ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించామని, ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 3.5 లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చారని, అందులో రూ.1300 కోట్లు బకాయి పెట్టారని జగన్ ఆరోపించారు.