ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2020 9:01 AM GMT
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 8వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ పరీక్షలను నిర్వహించడానికి ప్రైవేట్‌ ల్యాబొరేటరీల యజమానులు వసూలు చేస్తోన్న చార్ఝీలను మరింత కుదించింది.

కరోనా పరీక్షల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్‌కు గతంలో రూ.2400 ఉన్న ధరను రూ.1600కు కుదిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్‌గా ల్యాబ్స్ లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన 2900 రూపాయల ధరను 1900 కుదిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతో కిట్లు ధర తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్‌ ఉత్తర్వుల్లో వెల్లడించింది. కరోనా పరీక్షలను మరింత ముమ్మరం చేయడానికి ఈ కుదింపు వెసులుబాటు కల్పిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

నిన్న రాష్ట్రంలో 10,830 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,82,469కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,86,720 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 92,208 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 3,541 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story
Share it