అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సెలవు గడువును పెంచుతూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 నుంచ మార్చి 7 వరకు నెల రోజుల పాటు ఆయన సెలవు గడువును పొడిగిస్తూ ఏపీ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల రోజుల పాటు ఆయనకు సగం వేతనం అందనుంది. 2019 నవంబర్‌లో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను జగన్‌ ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది.

ఇది అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను రాజకీయ దుమారానికి దారి తీసింది. సీఎం ఆదేశాలను బేఖాతార్‌ చేశారనే కారణంతోనే ఆయనను ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసిందన్న వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బాధ్యతలను అప్పట్లో తాత్కాలిక సీఎస్‌ నీరబ్‌ కుమార్‌కు ఎల్వీ సుబ్రమణ్యం అప్పగించారు. తనను బదిలీ చేసిన బాపట్లలో హెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలను ఆయన స్వీకరించలేదు. మొదటిసారిగా డిసెంబర్‌ 6వ తేదీన ఎల్వీ సెలవు పెట్టారు. ఆ తర్వాత నెల నెలా తన సెలవును పొడిగించుకుంటున్నారు. తాజాగా ఆయన పెట్టుకున్న సెలవును సీఎం జగన్‌ ప్రభుత్వం అంగీకరించింది.

2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో చీఫ్‌ సెక్రటరీగా ఉన్న అనిల్‌ చంద్ర పునేఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ తర్వాత ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక పూర్తి కాలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆసమయంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఎల్వీని సీఎస్‌ బాధ్యతలను సీఎం జగన్‌ తప్పించారు. కేంద్రసర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆతర్వాత ఎల్వీ సుబ్రమణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్లాలనుకున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.