న్యాయం చేయండి.. నా కొడుకుని హిజ్రగా మార్చి.. ఆపై..

By Newsmeter.Network  Published on  4 Jan 2020 4:14 AM GMT
న్యాయం చేయండి.. నా కొడుకుని హిజ్రగా మార్చి.. ఆపై..

తూర్పుగోదావరి: తన కొడుకు హిజ్రాగా మారి ప్రాణాలు కోల్పోవడంతో ఓ తల్లి.. తనకు న్యాయం చేయాలంటూ అమలాపురంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మలికిపురం గ్రామానికి చెందిన చిక్కాల సావత్రికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వేణుగోపాల్‌ 2016 సంవత్సరంలో ఇల్లు విడిచివెళ్లిపోయాడు. అయితే 2018 సంవత్సరంలో యానాంకు చెందిన సూరంపుడి జాన్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి ఒక మహిళలో మలికిపురంలోని తన ఇంటికి వచ్చారని, ఆ మహిళగా ఉన్న వ్యక్తే తన కుమారుడని సావిత్రి తన ఫిర్యాదులో పేర్కొంది.

తన కుమారుడుని స్త్రీగా ఎందుకు మార్చారని తల్లి సావిత్రి జాన్‌ ప్రసాద్‌ను అడిగింది. వేణుగోపాల్‌, తాను ఇద్దరం ప్రేమించుకున్నామని దీంతో వేణుగోపాల్‌ని స్త్రీగా మార్చానని జాన్‌ ప్రసాద్‌ తెలిపాడు. ఆమెకు శ్రీనందిత అని పేరు పెట్టి యానంలో జీవిస్తున్నట్లు చెప్పడంతో తాము విస్తుపోయామని సావిత్రి పేర్కొంది. 2019 సంవత్సరం ఫిబ్రవరి 19న తన భర్త చనిపోతే వారివురు వచ్చి రెండు రోజులు మలికిపురంలో ఉండిపోయారని తెలిపింది. తర్వాత గత సంవత్సం సెప్టెంబర్‌ 14న శ్రీనందిత గ్యాస్‌ నొప్పితో ఆస్పత్రిలో చేర్చినట్లు జాన్‌ప్రసాద్‌ నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని తల్లి తెలిపింది.

కొడుకు వేణుగోపాల్ ‌(శ్రీనందిత), జాన్‌ ప్రసాద్‌ రికార్డింగ్‌ డ్యాన్స్‌లో పాల్గొనే వారని తల్లి సావిత్రి చెప్పుకొచ్చింది. తన కొడుకు చూసేందుకు ఆస్పత్రికి వెళ్తే.. ఆపేశారని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడని తెలిసిందని తల్లి ఆవేదనకు గురైంది. తన కొడుకు మృతదేహానికి సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేశారని వివరించింది. కుమారుడి మృతిపై అనుమానంతో మలికిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో అమలాపురం ఆర్డీవోకి ఫిర్యాదు చేసినట్లు తల్లి సావిత్రి పేర్కొంది. అంతకుముందు జాన్‌ప్రసాద్‌ను కుమారుడి మృతిపై అనుమానంతో ప్రశ్నించగా.. కొంత నగదు, బంగారం ఇస్తామని చెప్పారన్నారు. ఈ విషయమై పలుసార్లు జాన్‌ప్రసాద్‌ను అడుగగా సరైన సమాధానం చెప్పలేదని తల్లి సావిత్రి తెలిపింది. కేసులు వద్దని కాలయాపన చేసి ఇప్పుడు తనను చంపుతామని బెదిరిస్తున్నారని సావిత్రి ఆరోపించింది.

దీనిపై మలికిపురం ఎస్సై కె.వి రామారావుని వివరణ కోరగా ఫిర్యాదుపై స్పందించేందుకు నిరాకరించారు. ఏదిఏమైనా వేణుగోపాల్ ఇంటి నుంచి పారిపోయి ఎందుకు హిజ్రాగా మారిపోయాడు? ఎందుకు జాన్‌ని ప్రసాద్‌ని పెళ్లి చేసుకున్నట్లు..? ఆకస్మికంగా ఎందుకు చనిపోయాడు..? వంటి అనేక ప్రశ్నలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ కేసుపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్‌ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story