ఏపీలో రోజుకు 22వేల టెస్టులు... ఖర్చు ఎంతవుతోంది?

By సుభాష్  Published on  22 Jun 2020 3:35 AM GMT
ఏపీలో రోజుకు 22వేల టెస్టులు... ఖర్చు ఎంతవుతోంది?

మాయదారి మహమ్మారికి చెక్ పెట్టటం ఎలా? వ్యాక్సిన్ ఈ వైరస్ ఉత్పాతాన్ని నిలువరించే శక్తి ప్రజల చేతుల్లోనే ఉంది. నిత్యం అప్రమత్తంగా వ్యవహరించటంతో పాటు.. భౌతిక దూరాన్ని కచ్ఛితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక.. ప్రభుత్వ పరంగా చూస్తే.. పాజిటివ్ కేసులు వచ్చిన చోట.. వైరస్ వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోవటం.. నిర్దారణ టెస్టుల్ని అంతకంతకూ పెంచటం ద్వారా.. మహమ్మారి ఎంత లోతుల్లోకి వెళ్లిందో తెలుసుకునే వీలుంటుంది.

ఇదిలా ఉంటే..నిర్దారణ పరీక్షల విషయంలో కొన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున చేపడుతుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అందుకుభిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడి దాకానో ఎందుకు? తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో నిర్దారణ పరీక్షలు ఇప్పటికి ఆచితూచి అన్నట్లు చేస్తున్నారు. మొదట్లో పోలిస్తే ఇప్పుడు చేస్తున్న టెస్టుల సంఖ్య పెరిగినప్పటికీ.. పక్కనున్న ఏపీతో పోలిస్తే మాత్రం తీసికట్లేనని చెప్పాలి.

రోజుకు తెలంగాణలో చేస్తున్న నిర్దారణ పరీక్షలు నాలుగు వేల లోపే (దగ్గర దగ్గర మూడున్నర వేలు) ఉంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా రోజు గడిచేసరికి 22వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్దారణ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి సమాచారం బయటకువచ్చింది. నిత్యం తాము చేసే నిర్దారణ పరీక్షలు 22వేల వరకూ ఉన్నాయని.. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్దారణ పరీక్షల కోసమే రోజూ రూ.2కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్న ఆయన.. ఒకేసారి 40వేల మందికి వైద్యం అందించేలా బెడ్స్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అందులో 20వేల వరకు ఆక్సిజన్ బెడ్లే కావటం గమనార్హం.

ఏపీ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మహమ్మారి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటన్న పేరును సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో నలభై ఏళ్లు దాటి షుగర్.. కిడ్నీ.. హైపర్ టెన్షన్ తో బాధ పడే వారందరికి స్ర్కీనింగ్ చేయనున్నట్లు చెబుతున్నారు. ఇదంతా విన్నప్పుడు ఏపీకి పక్కనే ఉన్న సంపన్న రాష్ట్రమైన తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితి (నిర్దారణ పరీక్షల విషయంలో) నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story