పంతాలు పక్కన పెడతారా?

By అంజి  Published on  9 March 2020 3:55 AM GMT
పంతాలు పక్కన పెడతారా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెలాఖరులో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయిలో ఉంది. ఇరు పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ అయిన వైసీపీ ఇప్పటికే ఓ వ్యూహంతో ముందుకెళ్తుండగా.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అస్త్రంగా చేసుకొని టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఇరు పార్టీల నేతలు పల్లెల్లో మకాం వేస్తున్నారు.

ఈ నెల చివరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికశాతం పంచాయతీల్లో వైసీపీ పాగావేయాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఏమైనా తేడా వస్తే పదవులుసైతం ఊడతాయని మంత్రులకు, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా అధికశాతం పంచాయతీలు ఏకగ్రీవాలు అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా జగన్మోహన్‌రెడ్డి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించనున్నారు.

Also Read:

ఏపీలో నామినేషన్ల స్వీకరణ

ఏకగ్రీవ పంచాయతీలకు అధిక మొత్తంలో నజరానా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. గ్రామ సర్పంచ్‌లతో పాటు, వార్డు స్థానాలు ఏకగ్రీవమైతే జనాభాను బట్టి పంచాయతీకి రూ. 5లక్షల నుంచి రూ. 20లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వానికి పంపించింది. రెండుమూడు రోజుల్లో జీవోసైతం వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ మధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనే స్థాయిలో పోరుసాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గ్రామాల్లో సైతం ఇరుపార్టీల నేతలు నువ్వానేనా అన్నట్లు కాలుదువ్వుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ను ఏన్ని గ్రామాల ప్రజలు స్వీకరించి తమ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటారోననే చర్చ ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it