ఏపీ పరిపాలనా రాజధానిగా భోగాపురం..?

By సుభాష్  Published on  23 July 2020 7:30 AM GMT
ఏపీ పరిపాలనా రాజధానిగా భోగాపురం..?

ఏపీ రాజధానుల విషయంలో ఇప్పటికే జరుగుతున్న చర్చకు తోడుగా మరో ఆసక్తికర ప్రతిపాదనకు జగన్ సర్కారు సిద్ధమైందన్న మాట వినిపిస్తోంది. పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని భావిస్తున్న ఏపీ సర్కారు అందులో భాగంగా మరో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. విజయనగరానికి సమీపంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కేటాయించి వెనక్కి తీసుకున్న 500 ఎకరాల కోసం రాజధాని నిర్మాణానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

దీనికి సంబంధించి పక్కా ప్లాన్ సిద్ధం చేసేందుకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయటంతో పాటు.. ఏరోసిటీ, ఏవియేషన్‌ అకాడెమీ, విమానాల మరమ్మతులు, నిర్వహణ, ఓవర్‌ హాలింగ్‌ లాంటి వాటి కోసం రైతుల నుంచి 2703 ఎకరాల్ని సేకరించింది.

ఇదిలా ఉంటే.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానశ్రయ నిర్మాణ బాధ్యతను జీఎంఆర్ కు అప్పగించారు. అయితే.. ప్రాజెక్టులో పేర్కొన్నట్లుగా ఎవియేషన్ అకాడమీ.. ఆర్ఎంవో కేంద్రాలతో ఎలాంటి వ్యాపార ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించి.. ఇందుకు జీఎంఆర్ సంస్థ నో చెప్పింది. దీంతో.. ప్రభుత్వం తాను కేటాయించిన 500 ఎకరాల్ని వెనక్కి తీసుకుంది. తాజాగా ఈ 500 ఎకరాల్లో ఏపీ పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో విశాఖ నగరం నుంచి మెట్రో రైలు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. అయితే.. నిధుల సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. విశాఖ బీచ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు తీరం వెంబడి రహదారి కోసం ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.

తాజాగా నిర్వహించిన టెండర్లలో గుజరాత్ కు చెందిన హెచ్ సీపీ డిజైనింగ్ సంస్థకు పనులు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రణాళికలోనే ప్రభుత్వం వద్దనున్న 500 ఎకరాల్ని ఎలా వినియోగించుకోవాలా? అన్న అంశంపై సూచనలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో.. భోగాపురంలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ అంశంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Next Story