రాజధానిని మార్చం.. అమరావతే రాజధాని..!

By అంజి  Published on  14 Dec 2019 4:03 AM GMT
రాజధానిని మార్చం.. అమరావతే రాజధాని..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చే ప్రతిపాదన తమ దగ్గర లేదని వైసీపీ ప్రభుత్వం సృష్టం చేసింది. శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. రాష్ట్ర రాజధాని మార్పుపై టీడీపీ ఎమ్మెల్సీలు పమిడి శమంతకమణి, పరుచూరి అశోక్‌బాబు, గునపాటి దీపక్‌ కుమార్‌ ప్రశ్నలను సంధించారు. రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి వేరే చోటుకు మార్చే ప్రతిపాదన ఏమైనా ఉందా? రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఖర్చు చేసిన వ్యయ వివరాలేమిటి?, రాజధానిని మారిస్తే రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితి ఏమిటి అంటూ మంత్రి బొత్సకు ప్రశ్నలు వేశారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో మార్షల్స్‌ దురుసుదనంపైనే మధ్యాహ్నం వరకూ చర్చించారు. మార్షల్స్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయానికి అంతరాయం ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చివరిగా మండలి వాయిదా పడింది. ప్రశ్నోత్తరాలపై ఇచ్చిన సమాధానాలకు ఆమోదం తెలుపుతున్న చైర్మన్‌ ప్రకటించారు.

Next Story
Share it