అమరావతి: జనవరి 20వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చలు సాగే అవకాశాలున్నాయి. కాగా ఇటు అమరావతిలో, అటూ రాయలసీమలో రాజధాని అంశంపై ఆందోళనలు ఉద్రిక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్‌ స్పెషల్‌ అసెంబ్లీ సెషన్‌ నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ రాజధాని అంశంపై చేస్తున్న ఆందోళనలు రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్నాయి. రాజధాని రైతుల ఆందోళనలు రోజు, రోజుకూ పెరుగుతున్నాయి. అంతకంటే ముందు రాష్ట్ర కేబినెట్‌ భేటీ కానుంది. ఈ నెల 18న సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. స్పెషల్‌ అసెంబ్లీ సెషన్‌లో రాజధాని అంశంపై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయని సమాచారం.

మూడు రాజధానుల ఏర్పాటు దిశగా జగన్‌ సర్కార్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదించనున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై బోస్టన్‌ కమిటీ, జీఎన్‌ రావు కమిటీలు.. హైపవర్‌ కమిటీకి నివేదిక సమర్పించాయి. కమిటీలు తమ నివేదికల్లో వికేంద్రీకరణకే మొగ్గు చూపాయి. రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించాయి. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీల ఏర్పాటుపై సూచనలు చేసింది. కేంద్రీకృత పరిపాలన వల్ల ఒకే చోట అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడింది. అయితే వీకేంద్రీకరణ పాలన వల్ల రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని వివరించింది.

ఇప్పటికే హైపర్‌ కమిటీ రెండు సార్లు సమావేశమైంది. ఈ నెల 13వ తేదీన మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో అమరావతి రైతుల విషయంపై కీలకంగా చర్చించనున్నారు. ప్రజలకు ఎలాంటి ప్రయోజనకరమైన హామీలు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 17న ప్రభుత్వానికి హైపవర్‌ కమిటీ రాజధానుల అంశంపై నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత జరిగే కేబినెట్‌ భేటీలో కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనుంది. జనవరి 26న రిపబ్లిక్‌ వేడుకలు విశాఖలోని ఆర్కే బీచ్‌లో జరగనున్నట్లు సమాచారం. అంతకుముందే సచివాలయాని విశాఖకు తరలించే అవకాశాలున్నాయి. సచివాలయం తరలింపునకు ఇప్పటికే విడుతల వారీగా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.