చంద్రబాబు హయాంలో మద్యం ఏరులైపారింది: సీఎం జగన్
By సుభాష్ Published on 16 Dec 2019 9:46 PM ISTచంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులైపారిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ వాడి వేడిగా కొనసాగింది. ఇటు అధికార పార్టీ నేతలకు, ఇటు ప్రతిపక్షపార్టీనేతలకు మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మద్యంపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడుకు సీఎం జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో 4380 మద్యం షాపులు ఉంటే , తాము అధికారంలోకి వచ్చాక 25 శాతానికి తగ్గించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,456 మద్యం షాపులున్నాయని జగన్ వివరించారు. 44 వేల బెల్టు షాపులను ఎత్తివేశామని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో 29 లక్షల 62 వేల కేసుల లిక్కర్‌ను ఏపీలో విక్రయించగా, ఈ ఏడాది నవంబర్‌లో 22 లక్షల, 31 వేల లిక్కర్‌ను విక్రయించారు. ఈ లెక్క చూసుకుంటే 24 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్ల అమ్మకాల్లో 2018 నవంబర్‌లో 17 లక్షల 88 వేల కేసులు అమ్ముడపోగా, ఈ ఏడాది నవంబర్‌లో 8 లక్షల 13 వేల కేసులు మాత్రమే విక్రయించామని, రాష్ట్రంలో 54 శాతం బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయని వివరించారు.
రాజధాని కోసం సీఆర్డీఏ సేకరించిన భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు ఎక్కువ భూమి కేటాయించి, దళిత, బీసీ, మైనార్టీలకు సంబంధించిన అసైన్డ్ భూములకు మాత్రమే తక్కువ భూమి పరిహారంగా కేటాయించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 36 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ,అందులో ఒక్కటి మాత్రమే టీడీపీ గెలుచుకుందన్నారు. రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీల కోసం తమ ప్రభుత్వం మరో విప్లవాత్మక బిల్లును తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జనాలను నట్టేట ముంచాడని సీఎం జగన్ ధ్వజమెత్తారు.