13 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరైనా రాజధానిని మార్చారా..?
By సుభాష్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరుగుతోంది. రాజధాని అంశంపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు ప్రకటించడంపై మండిపడ్డారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని అనే ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. 13 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరైన రాజధానిని మార్చాలని ఆలోచించారా అని అన్నారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మారిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు కూడా సభలో తెగ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీలో రాజధానిని నిర్ణయించలేదని, రాజధాని ఎక్కడ ఉంటే మంచిదో కమిటీ చెప్పిందని గుర్తు చేశారు.
రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారని, అమరావతి ప్రాంతంలో పంటలు, తోటలు ఉండటం వల్ల ఆహార భద్రతకు ఎలాంటి లోటు ఉండదని కమిటీ తెలిపిందన్నారు. మీకు అనుకూలంగా రిపోర్టులు వస్తే వాళ్లే నిపుణులని ఎద్దేవా చేశారు. రాగద్వేషాలకు అతీతంగా భావితరాల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి ఢిల్లీ దేశ రాజధానిగా ఉందని, కర్ణాటక, ఆంధ్రా, తమిళనాడు కలిసి ఉన్నప్పటి నుంచి మద్రాస్ రాజధానిగా ఉందన్నారు. ముఖ్యమైన కార్యాలయాలన్ని ఢిల్లీలో ఉన్నాయని, కొత్త పార్లమెంట్‌నూ ఢిల్లీ మధ్యలోనే నిర్మిస్తున్నారన్నారు.