లంచాలు తీసుకునే అధికారులపై అవినీతి శాఖ కన్ను... ఫిర్యాదుల వెల్లువ

By Newsmeter.Network  Published on  1 Dec 2019 3:56 PM GMT
లంచాలు తీసుకునే అధికారులపై అవినీతి శాఖ కన్ను... ఫిర్యాదుల వెల్లువ

ముఖ్యాంశాలు

  • మూడు రోజుల్లో 170 ఫిర్యాదులు
  • అవినీతిలో గుంటూరు ‘రెవెన్యూ’ప్రథమం
  • బాధ్యులైన వారి భరతం పట్టేందుకు కాల్‌ సెంటర్‌

‌ప్రభుత్వ శాఖల్లో లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందించటానికి ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌ ఐఐఎంతో ఒప్పందం చేసుకుంది. అయితే ఒకవైపు ఆ బృందం ప్రభుత్వ శాఖల్లో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది...? దానిని ఎలా నివారించవచ్చో ప్రభుత్వానికి సిఫార్సులు చేయటానికి అధ్యయనం చేస్తోంది. మరోవైపు ప్రజలు నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకునే అవినీతిపై ఫిర్యాదు చేయండి, బాధ్యులైన వారి భరతం పడతామని కొత్తగా ‘14400’ కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కాల్‌ సెంటర్‌కు అవినీతి ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు పాల్పడే అవినీతిపై రాష్ట్రంలో అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. గత మూడు రోజుల్లో జిల్లాలో ఆయా శాఖల్లో ఉద్యోగులు పీడిస్తున్న లంచాలపై 170 కాల్స్‌ రావటమే ఇందుకు నిదర్శనం. రెవెన్యూ, విద్యుత్‌, పురపాలకశాఖల సేవలపై ఈ ఫిర్యాదులు ఎక్కువ వచ్చినట్లు తెలిసింది. కాల్‌ సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులను జిల్లాల వారీగా చేరవేసి వాటిపై చర్యల నివేదిక కోరుతోంది. గుంటూరు జిల్లా నుంచి వెళ్లిన ఫిర్యాదుల్లో 70 శాతం ఒక్క రెవెన్యూశాఖలో అవినీతిపైనే ఉన్నాయని గుర్తించారు అధికారులు. ఆ తర్వాత విద్యుత్తు, పురపాలకశాఖలు కూడా ఉన్నాయి. పంచాయతీరాజ్‌, జలవనరులు, వ్యవసాయ, పోలీసు శాఖల్లో అవినీతిపైనా ఫిర్యాదులు వచ్చాయని అధికారవర్గాలు తెలిపాయి.

నివేదిక ఆధారంగా నిర్థరించుకోడానికి అవినీతి శాఖ రెడీ అవుతోంది. రెవెన్యూశాఖలో భూ మార్పిడి, పాస్‌ పుస్తకాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున లంచాలు పీడిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. అడంగల్‌లో పేర్లు ఎక్కించటానికి, భూముల సర్వే నిర్వహణకు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటానికి, ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఎన్‌ఓసీలు ఇవ్వటానికి, ఫ్యామిలీ, కులము, పొజిషన్‌ సర్టిఫికెట్లకు లంచాలు లేనిదే దస్త్రం కదలటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గుంటూరు రూరల్‌, తాడికొండ, అమరావతి, తుళ్లూరు, మంగళగిరి, తెనాలి, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడురాళ్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల నుంచి కాల్స్‌ బాగా అందినట్లు తేలింది.ఈ మండలాల నుంచి మొత్తం 120 మంది ఫోన్లు చేసి ఆయా సేవలకు గాను లంచాలు ఇవ్వని కారణంగా తాము సకాలంలో అందుకోలేకపోయామని చెప్పుకొచ్చారు.

వీరు ఏ పనుల నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లారు....? లంచం డిమాండ్‌ చేసిన అధికారి పేరు ఏమిటి....? అలాగే ఈ లంచానికి సంబంధించి వారి వద్ద ఏమైనా వాయిస్‌ రికార్డులు లేదా రాతపూర్వక సమాచారం ఉందా అనే కోణంలో అధికారుల బాధితులను పిలిచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్తుశాఖ కార్యాలయంలో కొత్త గృహ కనెక్షన్లు, ఇళ్లమీదగా వెళ్లే లైన్లు మార్పిడి, స్తంభాల మార్పిడి వంటి పనులకు పెద్ద ఎత్తున లంచాలు అడుగుతున్నట్లు గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల, పొన్నూరు, రేపల్లె, మంగళగిరి, బాపట్ల ప్రాంతాల ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. పురపాలకశాఖలో సేవలకు జిల్లాలోని 13 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు అందటం గమనార్హం.

నీటి నల్లా కనెక్షన్లు ఇవ్వటానికి, డోరు నంబరు కేటాయించటానికి, పన్నులు వేయటానికి, భవనాల అనుమతులకు, స్వయం ఉపాధి పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయటానికి, కొత్త పింఛన్ల మంజూరుకు పెద్దఎత్తున లంచాలు ఆశిస్తున్నారని, అవి ఇవ్వకపోతే సేవలు జాప్యం చేస్తున్నారని ఇప్పటకే పలువురు బాధితులు ఏసీబీ అధికారులను కలిసి లంచావతారుల వివరాలు అందజేసినట్లు తెలిసింది.

గుంటూరు నగరపాలక సంస్థలో ప్రణాళిక విభాగంపై ఫిర్యాదులు బాగా వచ్చాయని తెలుస్తోంది. ఓ ఉద్యోగి ఇటీవల రెండు ప్లాట్లు కొనుగోలు చేశారని, మరో అధికారి ఓ బిల్డర్‌కు అన్నీతానై సలహాలిస్తూ నగరపాలక విధులను విస్మరిస్తున్నారని ఫిర్యాదు అందింది. అదేవిధంగా ఇద్దరు బిల్‌కలెక్టర్లు, ఒక ఆర్వో ఆదాయానికి మించి కూడబెట్టారని ఫిర్యాదులు కూడా అందినట్లు సమాచారం. ఓ ఉద్యోగి బదిలీపై బయటకు వెళ్లి మళ్లీ ఇక్కడకు రావటం వెనక అతను లంచాలకు ఇక్కడ బాగా అలవాటుపడటమేనని ఫిర్యాదుల ద్వారా తెలుస్తోంది. కొన్ని శాఖల్లో కొందరు అధికారులు లంచాలు అడగరు.. పనులు మాత్రం సకాలంలో చేయరని మరికొన్ని ఫిర్యాదులు అధికారులకు అందాయి.

అలాగే ఈ పనులను పెండింగ్‌ పెట్టడానికి కారణాలను ఏసీబీ అధికారులు తెలుసుకుంటున్నారు. నిధుల దుర్వినియోగంపై, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు కూడా అందటంతో వాటిపైనా అవినీతి శాఖ విచారణ జరుపుతోంది. దుర్వినియోగానికి సంబంధించి వారి వద్ద ఉన్న ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని శాఖల నుంచి ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఓ శాఖ అధికారి ద్వారా సమాచారం. అయతే ఫిర్యాదు దారుడు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగ్గా తెలియజేయాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోరని సమాచారం. ఇక సోమవారం నుంచి ఫిర్యాదులపై అధికారులు స్పందిచనున్నట్లు తెలుస్తోంది.

Next Story