ఏపీలో జూలై 1 నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 2:39 PM GMT
ఏపీలో జూలై 1 నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

ఏపీలో జూలై 1 నుంచి 15 వ‌రకు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హాణ‌పై మంత్రి మాట్లాడారు. త్వ‌ర‌లోనే ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌న్నారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ప‌రీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మ‌ద్య భౌతిక దూరం ఉండేలా చూస్తామ‌ని, మాస్కులకు కూడా అందిస్తామ‌న్నారు.

సాధార‌ణంగా విద్యార్థులు ప‌రీక్ష‌లు రాసేందుకు 2,900 ప‌రీక్షా కేంద్రాలు అవ‌స‌రం అవుతాయ‌ని, కానీ ప్ర‌స్తుతం భౌతిక దూరం నేప‌ధ్యంలో మ‌రిన్నీ ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. తర‌గ‌తి గ‌దిలో 12 మంది విద్యార్థులు మాత్ర‌మే పరీక్ష‌లు రాసేలా సీటింగ్ అరెంజ్ మెంట్ ఉంటుంద‌న్నారు. సోష‌ల్ మీడియాలోని ప్ర‌చారాల‌ను న‌మ్మొద‌ని అన్నారు. లాక్‌డౌన్ ముగిసిన వెంట‌నే టెన్త్ పరీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు అనే ప్ర‌చారాల‌ను అస్స‌లు న‌మ్మొద్ద‌ని కోరారు. ఇలాంటి అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it