అనుష్క జీవితంలో అదొక ఎమోషనల్ ఫంక్షన్..!

By సుభాష్  Published on  15 March 2020 7:25 PM IST
అనుష్క జీవితంలో అదొక ఎమోషనల్ ఫంక్షన్..!

అనుష్క శెట్టి.. లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోతోంది. మొదట్లో క్లాసు, మాస్ హీరోయిన్ గా మెప్పించి.. ఆ తర్వాత అరుంధతితో లేడీ ఓరియంట్ సబ్జెక్టులో నటించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా వెలిగిపోతోంది. ఈ మధ్యనే అనుష్క నటించిన సినిమా నిశ్శబ్దం ప్రీరిలీజ్ ఫంక్షన్ లో భాగంగా 15 సంవత్సరాల అనుష్క కెరీర్ గురించి కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరీ జగన్నాధ్ లు హాజరయ్యారు.

15 సంవత్సరాల క్రితం మార్చి 15న అనుష్క నటించిన సినిమా సూపర్ విడుదలైంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలో హీరోగా అక్కినేని నాగార్జున నటించాడు, మరో హీరోయిన్ గా అయేషా టాకియా నటించింది. తాను అనుష్కను హీరోయిన్ గా ఎలా సెలెక్ట్ చేశాను, ఇప్పటికీ బంగారు తల్లి అని ఆమెను అంటానని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

బాహుబలి దర్శకుడు రాజమౌళి కూడా అనుష్కను ప్రశంసల్లో ముంచేశాడు. అనుష్క చాలా మంచి అమ్మాయని.. ఆమె తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని రాజమౌళి తెలిపారు. స్వీటీ ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తుందని.. ఆమెతో బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర క్రియేట్ చేసినందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. తన సినిమాల్లో హీరోయిన్లకు ఇచ్చిన రోల్స్ లో దేవసేన అత్యుత్తమమని రాజమౌళి అన్నారు. స్వీటీ ప్రతీ షాట్ చేసి చూపించమని అంటుందని.. విక్రమార్కుడు సినిమా చేస్తున్నపుడు ప్రతి షాట్ అలానే చేసి చుపించానని, అయితే రవితేజతో ఉన్న రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేదని చెప్పారు రాజమౌళి. కొంత మందిని ప్రేమిస్తాం.. మరికొంత మందిని ఇష్టపడతాం.. కానీ స్వీటీని మాత్రం ఒక యాక్టర్‌గా, అలాగే ఒక మంచి మనసున్న మనిషిగా నేను ఎంతో గౌరవిస్తానని రాజమౌళి అన్నారు.

అనుష్క పెళ్లి గురించి రాఘవేంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వీటీ మంచితనానికి మారుపేరని.. అన్ని రకాల పాత్రలను పోషిస్తూ మెప్పిస్తున్న అనుష్క పెళ్లి చేసుకోని జీవితంలో స్థిరపడాలని సలహా ఇచ్చారు.

ఇక ఈ ఈవెంట్ చివర్లో మాట్లాడిన స్వీటీ కాస్త ఎమోషనల్ అయింది. 15 సంవత్సరాలు అయినా ఇంకా హార్డ్ వర్క్, మంచి క్యారెక్టర్లు చేయాలని అనుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు. సూపర్ తో మొదలైన నా సినిమా జర్నీ ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉందని.. మంచైనా, చెడైనా అన్ని అనుభవాలే తనను ఇక్కడికి తీసుకుని వచ్చిందని అనుష్క కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పింది. తన ఈ సినిమా జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అనుష్క చెప్పుకొచ్చింది.

పెళ్లి అనేది ఎప్పుడు జరగాలో.. అప్పుడు జరుగుతుంది. దాని కోసం వెయిట్ చేయడం తప్ప మరోటి లేదు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సమయం ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సిందే.. జరిగినప్పుడు అందరికీ తెలుస్తుంది అని నవ్వుతూ మైక్ ఇచ్చేసింది.

ప్రభాస్ కు తాను వేకువజామున మూడింటికైనా ఫోన్ చేయగలిగేంత చనువుందని తాజా ఇంటర్వ్యూలో అనుష్క వెల్లడించింది. వెండితెరపై తమ జోడీ సూపర్ హిట్ కావడంతో సహజంగానే ఊహాగానాలు వస్తుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. ప్రేమ అంటూ ఏవేవో ప్రచారం చేశారని.. ప్రభాస్ తనకు దశాబ్దకాలంగా తెలుసని, ప్రభాస్ వ్యక్తిత్వం కూడా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

Next Story