పవర్ కట్‌పై స్పందించిన‌ ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 9:53 AM GMT
పవర్ కట్‌పై స్పందించిన‌ ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి

రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కోతల నేపథ్యంలో అసలు విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేశారు అంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ స్పందించారు. కేఎస్‌కే థ‌ర్మల్ కేంద్రానికి ఇప్పటికే 120 కోట్లు చెల్లించామనీ.. దీనితో ఎక్స్చేంజ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి అనుమతి లభించిందన్నారు. మరో వైపు నేటి నుంచి ఏడు రోజుల పాటు రోజుకు 8 ర్యాక్‌ల‌ చొప్పున సింగరేణి నుంచి బొగ్గు రానుందన్నారు.

వాతావరణ మార్పులు కారణంగా గత పది రోజులుగా విద్యుత్ ఉత్పత్తి సరిగా లేదన్నారు. సరిగ్గా విద్యుత్ అవసరం అధికంగా ఉండే సమయానికి కరెంటు ఉత్పత్తి కావటం లేదన్నారు. గడచిన పది రోజుల్లో మూడు వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి కావాల్సి ఉండగా ఒకరోజు 815 మెగావాట్లు ఉత్పత్తి అయిందని.. ఒక రోజు మరీ కనిష్టంగా 28 మెగావాట్ల ఉత్పత్తి వచ్చిందని అన్నారు. బొగ్గు నిల్వల పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదనే వాదనలను ఖండించారు. ఈ ఏడాది ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం వల్ల 16 వేల టన్నుల బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నాయన్నారు.

మరోవైపు నేతలు సైతం విద్యుత్ కోతలపై మండిపడుతున్నారు. మిగులు విద్యుత్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే వంద రోజుల్లో జగన్ ప్రభుత్వం కరెంటు కోతలు విధిస్తూ ప్రజలకు నరకం చూపిస్తోంది అన్నారు. వర్షాలు పడి జలాశయాలు నిండినా కూడా కరెంటు కోతలు తప్పడం లేదన్న చంద్రబాబు.. ఇలాంటి చీకటి రాజ్యం వస్తుందని ఆనాడే ప్రజలను అప్రమత్తం చేశామ‌ని అన్నారు. మాజీ మంత్రి లోకేష్ అయితే.. జగన్‌ను 'రివర్స్ ముఖ్యమంత్రి' అంటూ ట్వీట్ చేశారు. నాలుగు నెలల్లోనే పవర్ కట్ లతో రాష్ట్రాన్ని కొవ్వొత్తులు, విసనకర్రల కాలానికి తీసుకువెళ్తున్నారు అన్నారు. టీడీపీ హయాంలో కరెంటు పోతే విచిత్రం అని, వైసీపీ పాలనలో కరెంటు ఉంటే అదృష్టం అంటూ విమర్శించారు.

అటు పవన్ కళ్యాణ్ కూడా విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ తీరుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ జెన్‌కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం.. గతం కంటే మెరుగ్గా ఉందని చెబుతున్నారు తప్ప విద్యుత్ ని మాత్రం ఇవ్వలేక పోతున్నారు అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

Next Story
Share it