ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేసినా టీడీపీ స్పందించ‌క‌పోవ‌డంతో నేరుగా లోక్‌స‌భ స్పీక‌ర్ కార్యాల‌య‌మే రంగంలోకి దిగింది. 30 ఏళ్లుగా టీడీపీ వాడుకుంటున్న గ‌దిని పార్ల‌మెంట్ సిబ్బంది ఢిల్లీలో ఖాళీ చేయించారు. 1999లో టీడీపీ నేత జీఎంసీ బాల‌యోగి స్పీక‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో టీడీపీకి పార్ల‌మెంట్‌ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఐదో నెంబ‌ర్ గ‌దిని కేటాయించారు. చాలా సార్లు టీడీపీ త‌రుపున త‌క్కువ మంది ఎంపీలు ఎన్నిక‌ల్లో గెలిచినా స‌రే గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఆ విశాల‌మైన గ‌దిని టీడీపీ వ‌దిలిపెట్ట‌లేదు. ఆ గ‌ది వాస్తు ప‌రంగా బాగా ఉండ‌టంతో పాటు పార్టీకి క‌లిసి వ‌చ్చింది అన్న‌ది టీడీపీ న‌మ్మ‌కం. 2014లో ఈ గ‌దిని నాటి స్పీక‌ర్ భారీగా సీట్లు గెలిచిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. వారు ఆ గ‌దిని స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా అప్ప‌ట్లో సృజ‌నా చౌద‌రి బృందం అడ్డుప‌డింది. వెంక‌య్య‌నాయుడు సాయంతో ఆ గ‌దిని తృణ‌మూల్ కాంగ్రెస్‌కు ద‌క్క‌కుండా అప్ప‌ట్లో టీడీపీ ఎంపీలు చ‌క్రం తిప్పారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ కేవ‌లం మూడు ఎంపీ స్థానాల‌కే ప‌రిమిత‌మ‌వ‌డంతో ఆ పార్టీకి ఇబ్బంది వ‌చ్చింది.

సాధార‌ణంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పెద్ద పార్టీల‌కు గ్రౌండ్ ఫ్లోర్‌లోని విశాల‌మైన గ‌దుల‌ను కేటాయిస్తారు. 30 ఏళ్లుగా టీడీపీ ఉప‌యోగిస్తున్న ఈ గ‌దిని సొంతం చేసుకునేందుకు వైసీపీతోపాటు డీఎంకే కూడా ప్ర‌య‌త్నించింది. స్పీక‌ర్ మాత్రం 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీకే ఈ గ‌దిని మూడు నెల‌ల క్రితం కేటాయించారు. అప్ప‌టి నుంచి ఖాళీ చేయాల్సిందిగా స్పీక‌ర్ కార్యాల‌యం కోరినా టీడీపీ ప‌ట్టించుకోలేదు. మ‌రోసారి ఢిల్లీలో ప‌లుకుబ‌డి ఉన్న కొంద‌రు పెద్ద‌ల ద్వారా స్పీక‌ర్ కార్యాల‌యంపై టీడీపీ ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంది అన్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పీక‌ర్‌కు లేఖ రాశారు. ముగ్గురు ఎంపీలే ఉన్న‌ప్ప‌టికీ విశాల‌మైన గ‌దిని త‌మ వ‌ద్దే అంటిపెట్టుకుని ఉండేందుకు బ‌య‌టి భ‌క్తుల ద్వారా స్పీక‌ర్ కార్యాల‌యంపై టీడీపీ ఒత్తిడి తెస్తుంద‌ని, ఈ విష‌యంలో జోక్యం చేసుకుని గ‌దిని త‌మ‌కు కేటాయించేలా చూడాల‌ని విజ‌య‌సాయిరెడ్డి లేఖ‌లో స్పీక‌ర్‌ను కోరారు.

దీంతో స్పీక‌ర్ ఆదేశాల మేర‌కు పార్ల‌మెంట్ సిబ్బంది రంగంలోకి దిగారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఐదో నెంబ‌ర్ గ‌దిని టీడీపీ చేత ఖాళీ చేయించారు. గ‌ది వెలుప‌ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డును ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యాల‌యాన్ని థ‌ర్డ్ ఫ్లోర్‌లోని 118 గ‌దికి త‌ర‌లించారు. వైసీపీకి కేటాయించిన ఐదో నెంబ‌ర్ గ‌దికి స‌మీపంలోనే ప్ర‌ధాని మోడీ ప‌ద‌వ నెంబ‌ర్ గ‌ది, అమిత్ షాకు కేటాయించిన ఎనిమిద‌వ నెంబ‌ర్ గ‌ది ఉన్నాయి. 30 ఏళ్లుగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఐద‌వ నెంబ‌ర్ గ‌దితో టీడీపీకి ఉన్న అనుబంధం ఇప్ప‌టికి తెగిపోయింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.