కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ ద్వారా ఒరిగిందేమీ లేదని, కేటాయింపుల్లో మొండిచేయి చూపించారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం తర్వాత పార్లమెంట్ ఆవరణలో విజయసాయి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ తమకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ నిరుపయోగమని తెలిపారు.

ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని, బడ్జెట్‌లో కొన్ని అనుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని చెప్పారు. ఆర్థిక సర్వేలో ఏపీకి సంబంధించి రెండు కీలక అంశాలను పేర్కొన్నారు. విభజన ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం ఇస్తానన్న నిధులు పెండింగ్ లో ఉన్నాయి. అన్నింటికీ మించి ఏపీకి ప్రత్యేక హోదా, ప్రకటించాల్సిఉన్న గ్రాంట్లు, ఇన్సెంటివ్ లు ఇతరత్రాపై మేం చాలా ఆశలు పెట్టుకున్నాం. వాటిలో ఏఒక్కదానిపైనా బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం బాధాకమని చెప్పారు.

రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు కావాలని, నిధుల కేటాయింపుల్లో మాత్రం ఏపీకి కేంద్రం మొండి చేయి చూపి, తన పక్షపాత ధోరణి చూపించింది ఆరోపించారు. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్ట్‌ కు త్వరితగతిన నిధులు కేటాయించాలి అని కోరారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.