ముగ్గురు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు నిలబడలేరు: వైవీ సుబ్బారెడ్డి
పవన్ ఎప్పుడూ ముగ్గురం కలిసి వస్తామని చెబుతున్నారు.. కానీ ఆ ముగ్గురు ఎప్పుడు కలిసి కనబడలేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla
ముగ్గురు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు నిలబడలేరు: వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో రాజకీయాలు మరోసారి పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల తర్వాత.. మరోసారి జనసేన అధినేతను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ ఇటీవల పొత్తులపై మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీంతో.. వైసీపీ నాయకులు ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్‌కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చురకలు అంటించారు.
పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు..? ఇతరులతో కలిసి పోటీ చేయడానికేనా అని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. పవన్ ఎప్పుడూ ముగ్గురం కలిసి వస్తామని చెబుతున్నారు.. కానీ ఆ ముగ్గురు ఎప్పుడు ఒక్కసారి కలిసి కనబడలేదని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా ఒక్కరొక్కరే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఏదీ ఏమైనా సీఎం జగన్ ఏపీలో ప్రజలకు మంచి చేస్తున్నారని.. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకాలు అందుతున్నయని అన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే.. పవన్ కళ్యాణ్ అంటున్నట్లుగా వారి ముగ్గురు పొత్తుపై కేంద్రంలో ఉన్న బీజేపీ మాట్లాడాలని అన్నారు. ఒక వేళ ముగ్గురు కలిసి ఏపీలో పోటీ చేసినా.. లేదా ఇద్దరు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు నిలబడలేరని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి భావిస్తున్నారు. ఏపీలో జగన్‌ను గద్దె దింపాలంటే మూడు పార్టీలు ఏకం కావాలని అంటున్నారు. పవన్ బీజేపీ, టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా.. టీడీపీ-బీజేపీ మధ్య మాత్రం సంబంధాలు సరిగ్గా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి.