వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది.
By అంజి
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
అమరావతి: వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దువ్వాడను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
''పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది'' అని వైఎస్‌ఆర్‌సీపీ తన అధికార ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే.. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా కె.కె. రాజుని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నియమించారు.